Kothamoni Kunta Under Encroachment Threat: Illegal Layouts Allegedly Flourish as HYDRA Faces Criticism

చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాలాపూర్‌ రెవెన్యూ పరిధిలోని కొంతమోని కుంట ఆక్రమణలకు గురవుతున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ వెంచర్లు వెలుస్తున్నా హైడ్రా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు.

బాలాపూర్‌ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 273లో ఉన్న కొంతమోని కుంటపై కబ్జాదారులు కన్నేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా చెరువు భూములు క్రమంగా ఆక్రమణలకు గురవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒకవైపు అక్రమ వెంచర్ల ఏర్పాటు కొనసాగుతున్నా సంబంధిత శాఖల అధికారులు అడ్డుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కుంట ఆక్రమణలపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో అధికారులు ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. అయితే రాజకీయ ఒత్తిళ్లు, కాంగ్రెస్‌ పార్టీ నేతల బెదిరింపుల కారణంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చెరువులు, కుంటల పరిరక్షణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు. హైడ్రా యంత్రాంగం సైతం ఆక్రమణల విషయంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు.

కొంతమోని కుంటలో జరుగుతున్న ఆక్రమణలను వెంటనే అడ్డుకోవాలని, అక్రమ వెంచర్లపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. చెరువు భూములను కాపాడేందుకు అధికారులు ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *