
DNews: వివాహేతర సంబంధం బయటపడుతుందనే భయంతో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి దారుణానికి పాల్పడింది. తమ సన్నిహితంగా ఉన్న విషయాన్ని చూసిన 15 ఏళ్ల బాలుడిని అడ్డు తొలగించుకోవాలని కుట్ర పన్నింది. కలుపు మందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించి బాలుడి ప్రాణాలు తీసింది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకోరుకొండి గ్రామంలో ఈ ఘటన కలకలం రేపింది.
సన్నిహితంగా ఉండటం చూసిన బాలుడు
పోలీసుల కథనం ప్రకారం.. భర్తతో విడిపోయిన అపర్ణ అనే మహిళ చిన్నకోరుకొండి గ్రామంలోని తన అమ్మమ్మ ఇంట్లో నివసిస్తోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన అజయ్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.
ఇద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి జిల్లెళ్ల రవి (15) వారిని చూశాడు. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెబుతానని రవి హెచ్చరించడంతో అపర్ణ, అజయ్ భయపడ్డారు. తమ బంధం బయటపడకుండా ఉండేందుకు బాలుడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు.
కూల్‌డ్రింక్‌లో కలుపు మందు కలిపి..
ఈ నేపథ్యంలో గత నెల 24న రవిని బయటకు తీసుకెళ్లిన నిందితులు కలుపు మందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించారు. అది తాగిన కొద్దిసేపటికే బాలుడి నోటిలో పొక్కులు రావడంతో పాటు చర్మంపై అలర్జీ లక్షణాలు కనిపించాయి.
అనారోగ్యానికి గురైన రవి ప్రశ్నించగా, కూల్‌డ్రింక్‌లో విషం కలిపినట్లు నిందితులు చెప్పినట్లు సమాచారం. దీంతో భయపడిన బాలుడు వెంటనే తన తండ్రికి, బంధువులకు జరిగిన విషయాన్ని వివరించాడు.
చికిత్స పొందుతూ బాలుడి మృతి
కుటుంబ సభ్యులు వెంటనే రవిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రవి ప్రాణాలు కోల్పోయాడు.
నిందితుల అరెస్ట్
బాలుడి మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో అపర్ణ, అజయ్ పాత్ర వెలుగులోకి రావడంతో ఇద్దరినీ అరెస్ట్ చేశారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
వివాహేతర సంబంధం బయటపడుతుందనే భయంతో ఒక బాలుడి ప్రాణాలు తీసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
