
DNews:11 NOV:హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగా, BRS అభ్యర్థి మాగంటి సునీత తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సోమాజిగూడ డివిజన్ లోని ఎల్లారెడ్డి గూడ నవోదయ కాలనీలో ఆమె కుమారుడు, ఇద్దరు కుమార్తెలతో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు.
హ్యాట్రిక్ విజయాలు సాధించిన మాగంటి గోపీనాథ్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గత మూడు ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి హ్యాట్రిక్ కొట్టారు. కానీ కొన్ని నెలల కిందట అనారోగ్య సమస్యలతో గోపీనాథ్ ఆకస్మికంగా మృతిచెందడంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్.. మాగంటి గోపీనాథ్ రెండో భార్య మాగంటి సునీతకు అవకాశం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి తన భర్త చేయాల్సిన పనులను తాను పూర్తి చేస్తానని సునీత చెబుతున్నారు. 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు.
మొత్తం 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 5 ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. 68 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి సీఆర్‌పీఎఫ్ బలగాలను రంగంలోకి దించారు. సీసీ కెమెరాలతో పాటు ఎన్నికల నిర్వహణలో డ్రోన్లను సైతం వినియోగిస్తున్నారు.
