
DNews:11 NOV:నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద జరిగిన ఘోర ప్రమాదం మరోసారి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. ఇటీవల వేమురి కావేరి ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదంలో 19 మంది సజీవ దహనమై చనిపోయిన ఘటన మర్చిపోవకముందే, మళ్లీ ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్ నుండి కందుకూరు వెళ్తున్న విహారి ట్రావెల్స్ ప్రైవేటు బస్సు హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై పిట్టంపల్లి వద్ద అకస్మాత్తుగా మంటలను చిమ్మింది. బస్సులో పొగలు వ్యాపించడంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమై, 29 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు దింపారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.
సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా దగ్దమై బూడిద అయిపోయింది. మంటలకు నిజమైన కారణం ఏమిటనేది ఇంకా తెలియరాలేదు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బస్సులో మంటలు ఎలా చెలరేగాయన్నదానిపై, యాంత్రిక లోపమా లేక ఇతర కారణాలా అన్నదానిపై విచారణ కొనసాగుతోంది.ప్రయాణికులు క్షేమంగా బయటపడటం పెద్ద ఉపశమనంగా నిలిచింది. అయితే వరుసగా జరుగుతున్న బస్సు అగ్ని ప్రమాదాలు ప్రయాణీకుల భద్రతపై తీవ్రమైన ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.
