Jharkhand Road Accident: Speeding Truck Runs Over Villagers, Seven Killed Including Three Children

Road Accident: ఝార్ఖండ్‌లో అర్ధరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ప్రమాదానికి గురైన స్కూటీని చూసేందుకు గుమిగూడిన గ్రామస్థులపైకి వేగంగా వచ్చిన భారీ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు సహా మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో చిన్నారి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ఝార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలో గురువారం రాత్రి ఈ విషాద ఘటన జరిగింది. కర్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రా-తోర్పా ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు రోడ్డుపక్కన నిలబడి ఉన్న గ్రామస్థులను ఢీకొట్టడంతో అక్కడికక్కడే పలువురు ప్రాణాలు కోల్పోయారు.

స్కూటీ ప్రమాదాన్ని చూసేందుకు వచ్చిన గ్రామస్థులపైకి ట్రక్కు

గురువారం రాత్రి సుమారు 9.45 గంటల సమయంలో ఓ స్కూటీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టు సమీపంలోని పొదల్లో పడిపోయింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు స్కూటీపై ఉన్న వ్యక్తికి సహాయం చేసేందుకు గుమిగూడారు.

అదే సమయంలో తోర్పా వైపు నుంచి కర్రా దిశగా అతివేగంతో వచ్చిన భారీ ట్రక్కు అదుపుతప్పి అక్కడున్న జనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు, పోలీసులు వెంటనే ఖుంటి సదర్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 12 ఏళ్ల సౌరభ్ నాయక్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మృతుల సంఖ్య ఏడుకు చేరింది.

మృతుల్లో 11 నెలల పసికందు కూడా..

ఈ ఘోర ప్రమాదంలో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. మృతుల్లో కేవలం 11 నెలల వయసున్న పసికందు కూడా ఉండటం అందరినీ కలచివేసింది. మరోవైపు ఖుష్బూ కుమారి అనే ఐదేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్, క్లీనర్ అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. ట్రక్కు డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడిపినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలను తెలుసుకునే పనిలో ఉన్నారు. ఒకే ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఖుంటి జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *