
D Educt: Sept 18: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) డిసెంబర్ 2026 నుంచి మార్చి 2027 వరకు నిర్వహించనున్న పలు ప్రధాన ప్రవేశ, అర్హత పరీక్షల తాత్కాలిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షల తేదీలను NTA తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
తాజా క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ 2026 యూజీసీ-నెట్ పరీక్షలు డిసెంబర్ 14 నుంచి 19 వరకు నిర్వహించనున్నారు. డిసెంబర్ 20, 21 తేదీలను బఫర్ రోజులుగా కేటాయించారు. జాయింట్ సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ పరీక్షలు డిసెంబర్ 20, 21 తేదీల్లో జరగనున్నాయి.
ఇక నిఫ్ట్ (NIFT) ప్రవేశ పరీక్షను జనవరి 10, 2027న నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్ 2027 సెషన్-1 పరీక్షలు జనవరి 22 నుంచి 24 వరకు, అలాగే జనవరి 28 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు NTA ప్రకటించింది. జనవరి 31ను బఫర్ డేగా ఉంచారు.
అలాగే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష జనవరి 31, 2027న నిర్వహించనున్నారు. సీయూఈటీ పీజీ (CUET-PG) 2027 పరీక్షలు మార్చి 1 నుంచి 25 మధ్య వివిధ తేదీల్లో నిర్వహించనున్నట్లు NTA తాత్కాలిక షెడ్యూల్‌లో పేర్కొంది.
విద్యార్థులు పరీక్షలకు సంబంధించిన తుది తేదీలు, దరఖాస్తు ప్రక్రియ, పరీక్ష కేంద్రాలు, అడ్మిట్ కార్డులు తదితర వివరాల కోసం NTA అధికారిక ప్రకటనలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించింది.
