అమెరికా–ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌ ఆయుధ నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో తన ఆయుధ సామర్థ్యాన్ని తిరిగి వేగంగా పెంచుకునే ప్రయత్నాలను ఇరాన్‌ ముమ్మరం చేసింది. ఈ క్రమంలో రష్యా నుంచి ఇరాన్‌కు రహస్య మార్గాల ద్వారా ఆయుధాలు అందుతున్నట్టు తాజాగా ఓ ఐరోపా ప్రభుత్వ నివేదిక వెల్లడించింది.

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంలో ఇరాన్‌కు మాస్కో ఇప్పటికే సైనిక, సాంకేతిక సహకారం అందిస్తున్నట్టు గతంలో పలు నివేదికలు వెలువడ్డాయి. అయితే, ప్రస్తుతం ఇరాన్‌ తన ఆయుధ నిల్వలను పునరుద్ధరించుకునేందుకు రష్యా నుంచి గోప్యంగా ఆయుధాలను స్వీకరిస్తున్నట్టు తాజా నివేదిక పేర్కొంది.

అమెరికా, ఇజ్రాయెల్‌తో జరిగిన యుద్ధం కారణంగా తగ్గిపోయిన ఆయుధ నిల్వలను తిరిగి పెంచుకునేందుకు ఇరాన్‌ వేగంగా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో రష్యా నుంచి ఇరాన్‌కు రహస్య మార్గాల్లో పేలుడు పదార్థాలు, డ్రోన్లు, మందుగుండు సామగ్రి సరఫరా అవుతున్నట్టు ఓ అంతర్జాతీయ పత్రిక వెల్లడించింది. కాస్పియన్‌ సముద్ర మార్గం ద్వారా ఈ ఆయుధ సామగ్రి ఇరాన్‌కు చేరుతున్నట్టు ఓ ఐరోపా ప్రభుత్వ నివేదికను ఉటంకిస్తూ పేర్కొంది. ఈ సమాచారాన్ని ఓ పాశ్చాత్య అధికారి కూడా ధ్రువీకరించినట్టు తెలిపింది.

మరోవైపు, ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించిన నిపుణుల ప్రకారం.. ఇరాన్‌ బాలిస్టిక్‌ క్షిపణుల తయారీకి అవసరమైన కీలక విడిభాగాలను కూడా రష్యా నుంచి పొందుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇరాన్‌ తన క్షిపణి, డ్రోన్‌ సామర్థ్యాలను వేగంగా పునరుద్ధరించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.

ఈ పరిణామం రష్యా–ఇరాన్ సైనిక సంబంధాల్లో కీలకమైన మార్పును సూచిస్తోంది. ఉక్రెయిన్‌ యుద్ధంలో ఉపయోగించేందుకు ఇరాన్‌ గతంలో రష్యాకు భారీగా ‘షాహెద్‌’ సిరీస్‌ డ్రోన్లను అందించింది. ఇప్పుడు పరిస్థితి మారి, ఇరాన్‌ కోల్పోయిన సైనిక సామర్థ్యాన్ని తిరిగి పెంచుకునేందుకు రష్యా సహకారం అందిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

కాస్పియన్‌ మార్గం కీలకం

రష్యా, ఇరాన్‌తో పాటు కజకిస్థాన్, తుర్క్‌మెనిస్థాన్, అజర్‌బైజాన్‌లకు మాత్రమే కాస్పియన్‌ సముద్రంతో సరిహద్దులు ఉన్నాయి. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం ఈ సముద్రంలో ఆయా దేశాలకు ప్రత్యేక హక్కులు ఉండటంతో పాశ్చాత్య నౌకాదళాల ప్రత్యక్ష జోక్యానికి అవకాశాలు పరిమితంగా ఉంటాయి. దీంతో రష్యా, ఇరాన్‌ మధ్య సముద్ర మార్గంలో రవాణా చేసే సరుకులను విదేశీ యుద్ధనౌకలు అడ్డుకోవడం సులభం కాదు.

అంతేకాకుండా, కొన్ని నౌకలు తమ ‘ఆటోమేటిక్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌’ (AIS) ట్రాన్స్‌పాండర్లను నిలిపివేస్తే వాటి కదలికలను పర్యవేక్షించడం మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. ఈ కారణాల వల్ల రష్యా నుంచి ఇరాన్‌కు సరఫరాల కోసం కాస్పియన్‌ సముద్ర మార్గం కీలకమైన రవాణా మార్గంగా మారుతున్నట్టు భావిస్తున్నారు.