అమెరికాలోని న్యూజెర్సీలో భారతీయ-అమెరికన్ సమాజం అరుదైన ఘనతను సాధించింది. మొత్తం 1,383 అమెరికా జెండాలతో ఫ్లాగ్‌పోల్స్‌పై ‘250’ సంఖ్యను రూపొందించి గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ ‘250’ ఆకృతిని భారత జెండాలతో చుట్టుముట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో భారత కాన్సులేట్ ప్రతినిధులతో పాటు స్థానిక అమెరికా ప్రజాప్రతినిధులు, FIA నాయకులు, వాలంటీర్లు పాల్గొన్నారు. భారత్-అమెరికా స్నేహబంధానికి, భారతీయ-అమెరికన్ సమాజం ఐక్యతకు ఈ రికార్డు ప్రతీకగా నిలుస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

అమెరికాలో నివసిస్తున్న భారతీయులు మరోసారి తమ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పారు. న్యూజెర్సీలోని పార్సిప్పనీ పట్టణంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించింది.

ఆగస్టు 15న పార్సిప్పనీలోని వెటరన్స్ మెమోరియల్ పార్క్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఏకంగా 1,383 అమెరికా జెండాలను ఫ్లాగ్‌పోల్స్‌పై ఏర్పాటు చేసి భారీగా ‘250’ సంఖ్యను రూపొందించారు. దీంతో ‘లార్జెస్ట్ ఫ్లాగ్‌పోల్ నంబర్’ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

ఈ భారీ ‘250’ సంఖ్య చుట్టూ భారత త్రివర్ణ పతాకాలను ఏర్పాటు చేసి భారత్, అమెరికా దేశాల మధ్య ఉన్న చారిత్రక, స్నేహపూర్వక సంబంధాలను ప్రతిబింబించారు. ఇరు దేశాల స్వాతంత్య్ర వేడుకల స్ఫూర్తిని చాటేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

భారత్ స్వాతంత్య్రానికి 80 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘India@80’, అమెరికా 250వ స్వాతంత్య్ర వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ‘America@250’ నేపథ్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతీయుల ఐక్యత, దేశభక్తి, అమెరికా పట్ల వారి అనుబంధానికి ఈ కార్యక్రమం ప్రతీకగా నిలిచింది.

ఈ రికార్డు ప్రదర్శనను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ప్రత్యక్షంగా పరిశీలించి ధ్రువీకరించారు. అనంతరం అధికారిక గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అడ్జుడికేటర్ రికార్డు సర్టిఫికెట్‌ను ఎఫ్ఐఏ నాయకులకు అందజేశారు. దీంతో ఈ కార్యక్రమం భారతీయ-అమెరికన్ సమాజానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది.

భారతీయ సమాజం ఐక్యతకు, తమ సంస్కృతి మరియు వారసత్వంపై ఉన్న గర్వానికి ఈ గిన్నిస్ రికార్డు నిదర్శనమని ఎఫ్ఐఏ ఛైర్మన్ అంకుర్ వైద్య అన్నారు. ఒకే లక్ష్యంతో అందరూ సమన్వయంతో పనిచేస్తే అసాధ్యమనుకున్న విజయాలను కూడా సాధించవచ్చని ఈ రికార్డు మరోసారి నిరూపించిందని ఆయన పేర్కొన్నారు.

భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఈ గిన్నిస్ రికార్డు ప్రతీకగా నిలుస్తుందని న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ అంబాసిడర్ బినయ శ్రీకాంత ప్రధాన్ తెలిపారు. రెండు ప్రజాస్వామ్య దేశాలను అనుసంధానిస్తున్న భారతీయ-అమెరికన్ ప్రవాస సమాజానికి ఇది ఘనమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పార్సిప్పనీ మేయర్ పుల్కిత్ దేశాయ్ పాల్గొని భారత్, అమెరికా మధ్య ఉన్న సారూప్యతలు, స్నేహపూర్వక సంబంధాలను ప్రస్తావించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి వెనుక ఉన్న విస్తృతమైన స్వచ్ఛంద సేవా కృషిని న్యూజెర్సీ లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ డేల్ జీ. కాల్డ్‌వెల్ ప్రశంసించారు.