
D Spiritual: Jul 17: హైదరాబాద్: శ్రీ జగదంబ మహంకాళి గొల్కొండ బోనాల ఉత్సవాల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. జూలై 19, 23, 26 తేదీల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గోల్కొండ కోట పరిసరాల్లో భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లను ఎంచుకోవాలని సూచించారు.
రామ్‌దేవ్‌గూడ నుంచి మక్కై దర్వాజా, లంగర్ హౌజ్ నుంచి ఫతే దర్వాజా, షేక్‌పేట్ నాలా నుంచి బంజారా దర్వాజా మీదుగా గోల్కొండ కోటకు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. అందువల్ల నార్సింగి, సన్‌సిటీ, లంగర్ హౌజ్ నుంచి షేక్‌పేట్, ఫిల్మ్‌నగర్, గచ్చిబౌలి మీదుగా వచ్చే వాహనాలను రామ్‌దేవ్‌గూడ వద్ద నుంచి లంగర్ హౌజ్–బాలికా భవన్–నానల్‌నగర్ వైపు మళ్లిస్తారు.
అదేవిధంగా ఫిల్మ్‌నగర్, షేక్‌పేట్ ప్రాంతాల నుంచి బంజారా దర్వాజా, మక్కై దర్వాజా మీదుగా వచ్చే ట్రాఫిక్‌ను బంజారా దర్వాజా వెలుపల అల్జాపూర్ రోడ్–నెక్నాంపూర్ వైపు మళ్లించనున్నారు. మొఘల్ కా నాలా నుంచి లంగర్ హౌజ్, ఫతే దర్వాజా మీదుగా గోల్కొండ కోటకు వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను లంగర్ హౌజ్ క్రాస్ రోడ్ వద్ద నుంచి బాలికా భవన్–నానల్‌నగర్ మార్గానికి మళ్లిస్తామని పోలీసులు తెలిపారు.
భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేశారు. రామ్‌దేవ్‌గూడ నుంచి మక్కై దర్వాజా మీదుగా వచ్చే ద్విచక్ర వాహనాలను అషూర్ ఖానా నుంచి ఆర్మీ సెంట్రీ పోస్టు వరకు, మిగిలిన వాటిని ఆర్టిలరీ సెంటర్ వద్ద పార్క్ చేసుకోవచ్చని సూచించారు.
లంగర్ హౌజ్ నుంచి ఫతే దర్వాజా మీదుగా వచ్చే భక్తులు తమ ద్విచక్ర వాహనాలను హుడా పార్క్, ప్రభుత్వ పాఠశాల, ఒవైసీ గ్రౌండ్‌లలో పార్క్ చేయాలని సూచించారు. కార్లు, ఆటోలను మాత్రం ఒవైసీ గ్రౌండ్‌లో మాత్రమే నిలిపివేయాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
షేక్‌పేట్ నుంచి బంజారా దర్వాజా మీదుగా గోల్కొండ కోటకు వచ్చే భక్తులు తమ బైక్‌లను గోల్కొండ ఏరియా ఆసుపత్రి వద్ద పార్క్ చేయాలని సూచించారు. కార్లు, ఆటోలు హాకీ గ్రౌండ్, ఒవైసీ గ్రౌండ్, డెక్కన్ పార్క్‌లలో పార్క్ చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
భక్తులు ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటిస్తూ ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని, పార్కింగ్ కోసం కేటాయించిన ప్రదేశాల్లోనే వాహనాలు నిలిపి ఉంచాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. దీంతో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు బోనాల ఉత్సవాలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు.
