
D News: సినిమా ఫలితం కంటే సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్ కొన్నిసార్లు నటీనటులపై మరింత ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ఒక సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోతే.. దాని ప్రభావం కెరీర్‌పైనా పడుతుంది. తాజాగా నటి ఐశ్వర్య లక్ష్మి తనకు ఎదురైన ఇలాంటి చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
దుల్కర్ సల్మాన్ హీరోగా, అభిలాష్ జోషి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కింగ్ ఆఫ్ కోథా’ 2023లో భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ మూవీ తర్వాత తన నటన, డైలాగ్ డెలివరీపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరిగిందని ఐశ్వర్య లక్ష్మి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఆ సమయంలో కేవలం తనను మాత్రమే కాకుండా.. దుల్కర్ సల్మాన్ సహా సినిమా టీమ్ మొత్తాన్ని నెటిజన్లు టార్గెట్ చేశారని చెప్పారు. సినిమాలో తాను దుల్కర్ పాత్రను ‘రాజువెట్టా’ అని పిలిచిన విధానాన్ని కూడా చాలామంది ఎగతాళి చేశారని తెలిపారు. కొన్ని సందర్భాల్లో వచ్చిన విమర్శలు తనలోనూ సందేహాలను కలిగించాయని ఐశ్వర్య లక్ష్మి పేర్కొన్నారు.
ట్రోలింగ్ ఎంతగా ప్రభావితం చేసిందో చెబుతూ.. ‘హలో మమ్మీ’ షూటింగ్ సమయంలో ఓ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా తనను పిలిచి ఆ విషయంపై వెక్కిరించారని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ ఘటన తనను ఎంతో బాధపెట్టిందని చెప్పారు.
అంతేకాదు.. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్‌తో కలిసి ఓ వాణిజ్య ప్రకటనలో నటించే అవకాశం వచ్చినప్పటికీ.. ట్రోల్స్‌కు భయపడి ఆ అవకాశాన్ని తానే వదులుకున్నట్లు ఐశ్వర్య లక్ష్మి వెల్లడించారు. “నేను నటిస్తే మళ్లీ దారుణంగా విమర్శలు వస్తాయి. అది మీకే సమస్య కావచ్చు” అని చెప్పి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలిపారు.
‘కింగ్ ఆఫ్ కోథా’ పరాజయం, ఆ తర్వాత ఎదురైన విమర్శలు తన మానసిక ధైర్యాన్ని దెబ్బతీశాయని ఐశ్వర్య లక్ష్మి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె సాయిధరమ్ తేజ్‌తో కలిసి ‘సంభరాల ఏటిగట్టు’ సినిమాలో నటిస్తున్నారు.
