హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ వాహన కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ప్రజలకు మెరుగైన ప్రజా రవాణా సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

నగరానికి నలువైపులా ఆధునిక బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి వెల్లడించారు. గాజులరామారం, శంషాబాద్, ఎల్బీనగర్, ఘట్కేసర్ ప్రాంతాల్లో బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేసే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు.

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు వైపు నుంచి హైదరాబాద్‌లోకి వచ్చే దూరప్రాంత, అంతర్‌జిల్లా, అంతర్రాష్ట్ర బస్సులను నగరంలోని అంతర్గత ప్రాంతాల్లోకి అనుమతించకుండా ఆయా దిశల్లో ఏర్పాటు చేసే టెర్మినల్స్ వరకే నడిపించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు.

విమానాశ్రయం వైపు వెళ్లే బస్సులు, హైదరాబాద్‌కు వచ్చే అంతర్‌జిల్లా బస్సులను కూడా అవసరాన్ని బట్టి నిర్దేశిత టెర్మినల్స్ వద్దే నిలిపివేసి అక్కడి నుంచి ప్రయాణికులను నగరంలోని వివిధ ప్రాంతాలకు తరలించేలా లాస్ట్ మైల్ కనెక్టివిటీని బలోపేతం చేయనున్నట్లు చెప్పారు.

టెర్మినల్స్ నుంచి ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు సులభంగా చేరుకునేలా సిటీ ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలు, ఎంఎంటీఎస్ సేవలను సమన్వయం చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. దీనివల్ల నగరానికి వచ్చే ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రజా రవాణా అందుబాటులోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు.

By Rajini