
DNews: హైదరాబాద్లో రాంగ్ రూట్లో బైక్ నడిపిన ఓ ఎస్బీఐ ఉద్యోగి నిర్లక్ష్యం ఇంజినీరింగ్ విద్యార్థిని ప్రాణం తీసింది. తండ్రితో కలిసి కళాశాలకు వెళ్తున్న 21 ఏళ్ల యువతి ఆర్టీసీ బస్సు కిందపడి మృతి చెందింది. ఈ విషాద ఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
అసలేం జరిగింది?
పాతబస్తీలోని హఫీజ్నగర్కు చెందిన షేక్ ఆయిషా ముస్ఫిరా (21) ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో బీఈ మైనింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. సోమవారం ఉదయం తండ్రి మహ్మద్ ఆరీఫ్తో కలిసి బైక్పై కళాశాలకు వెళ్తుండగా ఫీవర్ ఆసుపత్రి సిగ్నల్స్ సమీపంలో ఎదురుగా రాంగ్ రూట్లో వచ్చిన బైక్ను తప్పించే ప్రయత్నంలో వాహనం అదుపుతప్పింది.
దీంతో తండ్రి ఒకవైపు, ఆయిషా మరోవైపు రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు చక్రాల కింద ఆయిషా పడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది.
ఎస్బీఐ ఉద్యోగి అరెస్ట్
ఈ ప్రమాదానికి కారణమైన బీఎం ధర్మరాజు అనే ఎస్బీఐ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాంగ్ రూట్లో ప్రయాణించిన వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా యువతి భవిష్యత్తు అర్ధాంతరంగా ముగిసిపోయిందని పేర్కొన్నారు.
సజ్జనార్ కీలక హెచ్చరిక
రెండు నిమిషాలు ఆదా చేసుకోవాలనే తొందరపాటు మరో కుటుంబంలో జీవితాంతం తీరని విషాదాన్ని నింపిందని సజ్జనార్ అన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. మనం తీసుకునే రాంగ్ రూట్ మరొకరి జీవితానికి రాంగ్ ఎండ్ కాకూడదని హెచ్చరించారు.
