
ఈగల్ ఫోర్స్, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ఓ డ్రగ్ పెడ్లర్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.2.5 లక్షల విలువైన 200 మిల్లీలీటర్ల (330 గ్రాములు) హ్యాష్ ఆయిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రకాశం జిల్లాకు చెందిన బూర్సె నరేంద్ర శ్రీనివాస్ (30) ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో నివసిస్తూ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే చెడు వ్యసనాలకు అలవాటుపడిన అతడు గతంలో గంజాయి విక్రయిస్తూ సరూర్‌నగర్, మీర్పేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన పలు ఎన్డీపీఎస్ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గత నవంబర్‌లో బెయిల్‌పై బయటకు వచ్చిన అనంతరం డ్రైవింగ్ ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో తిరిగి డ్రగ్స్ విక్రయాల వైపు మళ్లినట్లు వెల్లడించారు.
Snapchat ద్వారా డ్రగ్స్ నెట్వర్క్
పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు నరేంద్ర శ్రీనివాస్ స్నాప్‌చాట్‌ను ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా పాడువాకు చెందిన ‘హరి’ అనే వ్యక్తితో స్నాప్‌చాట్ ద్వారా పరిచయం ఏర్పరచుకున్నాడు. అక్కడి నుంచి రూ.9,000కు హ్యాష్ ఆయిల్ కొనుగోలు చేసి, హైదరాబాద్‌లో 10 మిల్లీలీటర్లను రూ.1,200 చొప్పున విక్రయించాలని ప్లాన్ చేశాడు.
ఈ క్రమంలో ఆగస్టు 2న ఒడిశాకు వెళ్లిన నరేంద్ర.. అక్కడ హ్యాష్ ఆయిల్ కొనుగోలు చేసి ఆగస్టు 7న బస్సులో హైదరాబాద్‌కు బయలుదేరాడు. అరెస్టు కాకుండా ఉండేందుకు ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోకుండా, మార్గమధ్యంలో అందుబాటులో ఉన్న బస్సుల్లో ప్రయాణించే విధానాన్ని అనుసరించినట్లు పోలీసులు వెల్లడించారు.
ORR వద్ద పట్టుకున్న పోలీసులు
విశ్వసనీయ సమాచారం అందడంతో ఆగస్టు 8న ఈగల్ ఫోర్స్, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఔటర్ రింగ్ రోడ్డు (ORR) సమీపంలో నిఘా ఏర్పాటు చేశారు. ఒడిశా నుంచి వచ్చిన బస్సు నుంచి దిగిన నరేంద్ర శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న రెండు బాటిళ్లలోని హ్యాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పరారీలో ఉన్న ప్రధాన సరఫరాదారు ‘హరి’ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఈగల్ ఫోర్స్ సూచించింది.
