D NEWS: తెలంగాణలో పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందిస్తున్న కళ్యాణ లక్ష్మి పథకం 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించిందని హరీశ్‌రావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పథకం కింద 13,15,297 మంది లబ్ధిదారులకు రూ.11,560 కోట్లకు పైగా సాయం అందించినట్లు ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పథకం అమలులో జాప్యం జరుగుతోందని హరీశ్‌రావు ఆరోపించారు. పెళ్లిళ్లు పూర్తయి పిల్లలు పుట్టినా కళ్యాణ లక్ష్మి సాయం కోసం పేద కుటుంబాలు ఎదురుచూస్తున్నాయని విమర్శించారు.

కాంగ్రెస్ ఎన్నికల సమయంలో రూ.లక్ష నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిందని హరీశ్‌రావు గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు అవుతున్నా ఆ హామీ అమలు కాలేదని ఆయన విమర్శించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

సుమారు రెండు లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. పథకాన్ని నిర్వీర్యం చేయకుండా పేదింటి ఆడబిడ్డలకు అండగా కొనసాగించాలని కోరారు. తులం బంగారం హామీని అమలు చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.