D NEWS: ఓటు హక్కును కాపాడుకోవాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్‌సింగ్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

‘ఓటు బచావో.. దేశ్ బచావో’ నినాదంతో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై రామగుండంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఎస్‌ఐఆర్ పేరుతో దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఓట్లు తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు.

రామగుండం నియోజకవర్గంలోనూ సుమారు 35 వేల ఓట్లు తగ్గాయని రాజ్ ఠాగూర్ పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణలో బీజేపీ కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. అర్హులైన ప్రతి ఓటరు హక్కును కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.

ఓటర్ల జాబితా సవరణలో ఇంటింటి పరిశీలన, ముసాయిదా జాబితా, అభ్యంతరాలు, దావాలు, అప్పీల్ వంటి ప్రక్రియలు ఉన్నాయని ఎమ్మెల్యే వివరించారు. ప్రతి ఓటరు తన పేరు జాబితాలో ఉందో లేదో పరిశీలించుకోవాలని సూచించారు. సమస్య ఉంటే ఎన్నికల సంఘం నిర్దేశించిన విధానంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

ప్రజల్లో ఉన్న అనుమానాలను అధికారులు నివృత్తి చేయాలని రాజ్ ఠాగూర్ కోరారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య యాదవ్, కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.