
D Educt: Oct 2: రాష్ట్రంలో ప్రస్తుతం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఇన్‌సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేక టెట్-2 నిర్వహించేందుకు విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 7 నుంచి 16వ తేదీ వరకు అర్హులైన ఉపాధ్యాయుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు, టెట్ ఛైర్మన్ నవీన్ నికోలస్ అక్టోబర్ 1న నోటిఫికేషన్ జారీ చేశారు. పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా అధికారులు ప్రకటించారు.
నోటిఫికేషన్ ప్రకారం నవంబర్ 16 నుంచి 21వ తేదీ మధ్య ఆన్‌లైన్ విధానంలో టెట్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష ఫలితాలను డిసెంబర్ 9 నుంచి 11వ తేదీ మధ్య విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో రెగ్యులర్ విధానంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉద్యోగాల్లో కొనసాగాలంటే 2028 ఆగస్టు నాటికి టెట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇన్‌సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేకంగా టెట్-2 పరీక్షను నిర్వహిస్తున్నారు.
ప్రత్యేక టెట్ ద్వారా అర్హత సాధించేందుకు అవకాశం కల్పించడంతో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు నిర్ణీత గడువులోగా పరీక్షకు దరఖాస్తు చేసుకుని, టెట్ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
