D News: Oct 8: Free Health Tests: ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం కోసం కార్మిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని నిర్మాణ కార్మికులందరికీ ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు కార్మిక శాఖ కార్యదర్శి శేషగిరిబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13.38 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది.

నిత్యం శ్రమించే నిర్మాణ కార్మికుల ఆరోగ్య భద్రతను మెరుగుపరచడం, వివిధ అనారోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స అందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది. ఇందులో భాగంగా కార్మికులకు అవసరమైన ఆరోగ్య పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నారు.

ఈ ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని రెండు దశల్లో అమలు చేయనున్నారు. ప్రతి కార్మికుడికి ఉచితంగా 18 రకాల ఆరోగ్య స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో కార్మికుడి వైద్య పరీక్షల కోసం ప్రభుత్వం రూ.2,620 చొప్పున ఖర్చు చేయనుండగా, మొత్తం ఈ కార్యక్రమానికి సుమారు రూ.349 కోట్లను కేటాయించనుంది.

స్క్రీనింగ్ పరీక్షల్లో తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేదా వ్యాధులు గుర్తించిన కార్మికులను తదుపరి చికిత్స కోసం మెరుగైన ఆస్పత్రులకు రిఫర్ చేయనున్నారు. అంతేకాకుండా, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కార్మికులకు రెండో ఏడాది కూడా ఉచితంగా వైద్య పరీక్షలు, వైద్య పర్యవేక్షణ కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.