D Educt: Oct 8: AP Integrated Gurukul: ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక సమరసత, నాణ్యమైన విద్యను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన విద్యార్థులు ఒకే ప్రాంగణంలో కలిసి విద్యనభ్యసించేలా ‘ఇంటిగ్రేటెడ్ గురుకుల విద్యాలయాల’ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 500 ఇంటిగ్రేటెడ్ గురుకులాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

వివిధ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులు చిన్నతనం నుంచే కలిసి చదువుకోవడం ద్వారా వారిలో పరస్పర అవగాహన, సమానత్వ భావన పెంపొందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వివక్షకు తావులేని వాతావరణంలో విద్యార్థులు కలిసి విద్యను అభ్యసించేలా ఈ గురుకులాలను తీర్చిదిద్దాలని నిర్ణయించింది.

ఈ సమగ్ర విద్యా సంస్కరణలో భాగంగా వచ్చే విద్యా సంవత్సరం నాటికి తొలి విడతలో 25 ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలను నిర్మించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఒక్కో గురుకుల ప్రాంగణంలో సుమారు 1,000 నుంచి 1,500 మంది విద్యార్థులకు ఆధునిక వసతులతో కూడిన విద్యను అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

అయితే కొత్త విధానం అమల్లోకి వచ్చినప్పటికీ ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్సీ (SC), ఎస్టీ (ST), బీసీ (BC), మైనార్టీ గురుకుల విద్యాలయాల్లో ఎలాంటి మార్పులు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ గురుకులాలు ప్రస్తుతం ఉన్న విధంగానే యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది.