
D Spiritual: Sept 24: Vijayawada: దుర్గమ్మ సన్నిధిలో ‘లడ్డూ ప్రసాదం ఏటీఎం’ ప్రారంభం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ సన్నిధిలో భక్తుల సౌకర్యార్థం అధికారులు నూతన సాంకేతిక సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా రూపొందించిన ‘లడ్డూ ప్రసాదం ఏటీఎం’ను బుధవారం ప్రారంభించారు.
కొండ దిగువన అర్జున వీధి ప్రారంభంలో ఉన్న సెంట్రల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ప్రాంగణంలో ఈ స్వయంచాలక ప్రసాదం వెండింగ్ మెషిన్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా భక్తులు ప్రత్యేకంగా క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా లడ్డూ ప్రసాదాన్ని పొందే అవకాశం కల్పించారు.
ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ మాట్లాడుతూ.. దుర్గమ్మ ప్రసాదం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండకుండా త్వరగా, సులభంగా లడ్డూలను పొందేందుకు ఈ యంత్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
లడ్డూ ప్రసాదం ఏటీఎంలో డిజిటల్ చెల్లింపుల కోసం యూపీఐ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. భక్తులు యూపీఐ ద్వారా చెల్లింపు చేసిన వెంటనే యంత్రం నుంచి లడ్డూ ప్రసాదం అందుకునేలా దీనిని రూపొందించారు.
ఈ సాంకేతిక సదుపాయం అందుబాటులోకి రావడంతో దసరా ఉత్సవాలతో పాటు సాధారణ రోజుల్లోనూ ప్రసాదం కోసం భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే సమయం తగ్గుతుందని దేవాదాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. తద్వారా భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శన అనుభవం లభించనుంది.
