
D Spiritual: Sept 24: గణేశ్ నిమజ్జనానికి సెప్టెంబర్ 25న సాధారణ సెలవు
తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించిన గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. హైదరాబాద్ నగరంలో భారీ స్థాయిలో జరగనున్న వినాయక విగ్రహాల నిమజ్జన మహోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
సెప్టెంబర్ 25న హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సాధారణ సెలవు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ జీవో ఆర్టీ నంబర్ 1396 ద్వారా ఈ ఉత్తర్వులను విడుదల చేశారు. సెప్టెంబర్ 25న ప్రకటించిన సెలవుకు బదులుగా నవంబర్ 14వ తేదీ, రెండో శనివారాన్ని పని దినంగా పాటించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
నిమజ్జన ఊరేగింపుల కారణంగా నగరంలో భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉండటంతో పాటు భద్రతా పరమైన అంశాలు, ప్రజా రవాణాపై పడే ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రజలకు ఇబ్బందులు తగ్గించేందుకు ముందస్తు చర్యగా సెలవు ప్రకటించినట్లు పేర్కొంది.
సెప్టెంబర్ 25న జరిగే తుది నిమజ్జన కార్యక్రమంలో హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల నుంచి వేలాది వినాయక విగ్రహాలు హుస్సేన్‌సాగర్‌తో పాటు నగరంలోని పలు చెరువులు, కృత్రిమ నిమజ్జన కొలనుల్లో నిమజ్జనం కానున్నాయి.
ఈ నిమజ్జన వేడుకల్లో ఖైరతాబాద్ మహాగణపతి, బాలాపూర్ గణేశ్ విగ్రహాల ఊరేగింపులు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
