
DNews:21 Feb: హైదరాబాద్‌లోని నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) అగ్నిప్రమాద కేసులో దర్యాప్తు సంస్థలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ ప్రమాదంలో దగ్ధమైన డేటాపై పరిశోధన చేసిన నాగ్‌పూర్ స్పెషల్ టీమ్ తన నివేదికలో అత్యంత కీలకమైన అంశాలను వెల్లడించింది. మొత్తం 1,100 ఫైల్స్ పూర్తిగా కాలిబూడిదయ్యాయని, వాటిని రికవరీ చేయడం సాంకేతికంగా సాధ్యం కాదని నిపుణుల బృందం తేల్చి చెప్పింది.
ఫిబ్రవరి 7న జరిగిన ఈ ప్రమాదంలో భవనంలోని మొదటి అంతస్తు పూర్తిగా దెబ్బతినగా, సుమారు 50 కంప్యూటర్లతో పాటు నేర పరిశోధనలో అత్యంత కీలకమైన హార్డ్ డిస్కులు కాలిపోయాయి. ముఖ్యంగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు కూడా ఈ ప్రమాదంలో ధ్వంసమైనట్లు తెలుస్తోంది. హత్యలు, లైంగిక దాడులు, డ్రగ్స్ మరియు నకిలీ పత్రాలకు సంబంధించిన అనేక కీలక కేసుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నేరస్తులకు శిక్ష పడటంలో కీలక పాత్ర పోషించే డీఎన్ఏ, ఫింగర్ ప్రింట్స్ వంటి డిజిటల్ సాక్ష్యాధారాలు శాశ్వతంగా కనుమరుగవ్వడం పోలీసు శాఖలో ఆందోళన కలిగిస్తోంది.
