
DNews: Feb 21: ఫిబ్రవరి 2025లో జరిగిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కాలువ (SLBC) టన్నెల్ ప్రమాదం ఎనిమిది మంది కార్మికుల ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటనలో ఇద్దరి మృతదేహాలను మాత్రమే బయటకు తీసుకోగలిగారు, మిగతా ఆరుగురి శరీరాలు ఇప్పటికీ టన్నెల్లోనే ఉన్నాయి. ఈ విషాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. అప్పటి నుండి పాలక కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ, కార్మికుల కుటుంబాలు చివరి చూపు కూడా చూడలేక మానసిక వేదనకు గురయ్యారని ఆరోపిస్తున్నారు.
ఘటనకు సంవత్సరం పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ, ఒక సంవత్సరం గడిచినా మృతదేహాల వెలికితీతలోనూ, టన్నెల్ పనుల్లోనూ ఎలాంటి పురోగతి లేకపోవడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం, అశక్తతకు నిదర్శనమని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు కమీషన్లు, కాంట్రాక్టులు, వాటాలపై దృష్టి పెట్టకుండా కనీసం కార్మిక సంక్షేమం, ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టి ఉంటే ఇలాంటి విషాదాలు పునరావృతం కావని ఆయన వ్యాఖ్యానించారు.
