
DNews:21 Feb: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార కాంగ్రెస్ మరియు బీజేపీ కార్యకర్తల మధ్య తలెత్తిన ఘర్షణ చిలికి చిలికి గాలివానలా మారి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనలో భాగంగా బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులకు చెందిన కార్లను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు. ఆగ్రహంతో ఊగిపోయిన ఆందోళనకారులు కాంగ్రెస్ నేతల వాహనాల అద్దాలను పగలగొట్టి ధ్వంసం చేయడంతో అక్కడ బీభత్స వాతావరణం నెలకొంది.
ఈ ఘర్షణల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం మరియు తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను చెల్లాచెదురు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పట్టణంలో ఎక్కడికక్కడ భారీగా పోలీసు బలగాలను మోహరించారు. రాజకీయ పగలతో సామాన్య ప్రజలు కూడా భయాందోళనలకు గురవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
