
D Spiritual: Feb 13: మాఘ మాసం బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ప్రారంభించే ప్రతి కార్యంలో విజయమే వరిస్తుందని విశ్వాసం. 2026 సంవత్సరంలో విజయ ఏకాదశి ఫిబ్రవరి 13న, శుక్రవారం వచ్చింది. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే తలపెట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
విజయ ఏకాదశి వెనుక పురాణ గాథ కూడా ఉంది. శ్రీరాముడు రావణుడిపై విజయం సాధించే ముందు ఈ వ్రతాన్ని ఆచరించాడని స్కాంద పురాణంలో పేర్కొన్నారు. ఆ వ్రత ప్రభావంతో సేతు నిర్మాణ ఆలోచన కలిగి, వానరసేన సహాయంతో లంక చేరి విజయాన్ని సాధించాడని విశ్వసిస్తారు. అందుకే దీనికి “విజయ” ఏకాదశి అనే పేరు వచ్చింది.
ఈ రోజున ఉపవాసం ఉండటం ముఖ్యంగా భావిస్తారు. పగలంతా అన్నం తినకుండా పాలు, పండ్లు తీసుకుని ఉపవాసం ఉండాలి. రాత్రి విష్ణుమూర్తిని స్మరించాలి. మరుసటి రోజు ద్వాదశి ఘడియలలో పారణ చేసి ఆహారం స్వీకరించాలి. ఏకాదశి రోజున “ఓం నమో భగవతే విష్ణవే” మంత్రాన్ని జపించడం, విష్ణు సహస్రనామం లేదా ఇతర విష్ణు స్తోత్రాలు పఠించడం శ్రేయస్కరం.
పూజ విధానంగా ఒక పాత్రలో నీరు నింపి మామిడి ఆకులతో అలంకరించి, లక్ష్మీనారాయణుల చిత్రపటం ముందు పంచోపచార పూజ చేయాలి. మరుసటి రోజు ఆ పాత్రను దానంగా ఇవ్వడం శుభప్రదం. వస్త్రదానం, గొడుగు, పాదరక్షలు, ధాన్యదానం వంటి దానాలు విశేష ఫలితాలను ఇస్తాయని చెబుతారు.
ఏకాదశి రోజున అన్నం తినకూడదని పురాణాల్లో పేర్కొన్నారు. అలాగే హెయిర్ కటింగ్, షేవింగ్, గోర్లు కత్తిరించడం, అభ్యంగన స్నానం చేయడం నివారించాలి. మృతికా స్నానం (నువ్వుల పిండి, గోమయం, మట్టి మిశ్రమంతో స్నానం) చేయడం విజయాలను అందిస్తుందని విశ్వాసం. ఈ విధంగా భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే విజయ ఏకాదశి మహత్తర ఫలితాలను ప్రసాదిస్తుందని నమ్మకం.
