
D News: ఎలాంటి భారీ అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం సాధించిన ‘బేబీ’ సినిమాతో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ ఇద్దరూ ‘ఎపిక్’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘నైంటీస్: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’తో గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు గురువారం రాత్రి నుంచే ప్రీమియర్ షోలు పడ్డాయి. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ప్రస్తుతం ‘ఎపిక్’కు పాజిటివ్ టాక్ వస్తున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా సినిమాలో తండ్రి–కొడుకు అనుబంధం, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని కామెంట్స్ వస్తున్నాయి. ఫస్ట్ హాఫ్‌లో కామెడీకి ప్రాధాన్యత ఇచ్చిన దర్శకుడు.. సెకండాఫ్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్, మిడిల్ క్లాస్ జీవితాన్ని సహజంగా చూపించారని ఆడియన్స్ అంటున్నారు.
కెరీర్ కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయాల్సి వచ్చే పరిస్థితులను చాలా రియలిస్టిక్‌గా చూపించారని, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయని పలువురు చెబుతున్నారు. ఫన్, ఎమోషన్ రెండింటినీ బ్యాలెన్స్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే టాక్ వినిపిస్తోంది.
ఇక ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరోసారి తమ నటనతో మెప్పించారని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. విలేజ్ నుంచి అబ్రాడ్ వెళ్లిన యువకుడు అక్కడ ఎదుర్కొనే పరిస్థితులు, కామెడీ సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యాయని అంటున్నారు. మొత్తంగా ‘ఎపిక్’ ఒక ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంటోందనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
