
D Spiritual: Dec 4: హిందూ ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజులపాటు ప్రజలందరూ ఈ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. సంక్రాంతి అంటేనే రంగురంగుల ముగ్గులు, పిండి వంటలు ప్రత్యేకం. ఈ పండుగ రోజున దేశ విదేశాలలో ఉన్న హిందువులందరూ తమ సొంత ఊర్లకు చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి ఈ పండుగను జరుపుకుంటారు.
సంక్రాంతి పండుగలో మూడు రోజులు ముఖ్యమైనవి—మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. మొదటిరోజు అయిన భోగి పండుగ రోజున కొత్త ధాన్యాలతో పొంగలి చేసి దేవుడికి నైవేద్యంగా పెడతారు. అలాగే చిరుధాన్యాలతో రొట్టెలు చేసే ఆచారం కూడా భోగి పండుగ ప్రత్యేకత.
భోగి పండుగ రోజున భోగి మంటలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. తెల్లవారుజామునే ఇంటి ముందు భోగి మంట వేయడం చాలా కాలంగా కొనసాగుతున్న ఆచారం. ఇంటిలోని పాత వస్తువులను భోగిమంటలో వేసి తగలబెట్టడం, అలాగే ఆవుపేడతో తయారు చేసిన పిడకలు వేయడం సంప్రదాయంగా చేస్తారు. భోగి మంట వేయడం ద్వారా ఇంటిలోని దరిద్ర దేవత తొలగిపోతుందని ప్రజల విశ్వాసం.
అయితే భోగి మంటలు కేవలం వెచ్చదనం మాత్రమే ఇవ్వవు; ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ధనుర్మాసంలో ఇంటి ముందు పెట్టిన ఆవుపేడ గొబ్బెమ్మలను పిడకలుగా చేసి భోగిపండుగ రోజున మంటలో వేస్తారు. ఆవుపేడలో ఆంటీబయాటిక్ గుణాలు ఉండడం వల్ల మంటలో కాల్చినప్పుడు వాతావరణంలో ఉన్న సూక్ష్మజీవులు నశిస్తాయి. అలాగే రావి, మామిడి, మేడి వంటి ఔషధ చెట్ల బెరళ్లను భోగి మంటల్లో వేస్తే గాలి శుద్ధి అవుతుందని నమ్మకం.
