D-News: హైదరాబాద్‌లోని నేరెడ్‌మెట్‌కు చెందిన 85 ఏళ్ల రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగిని టార్గెట్ చేసిన డిజిటల్ అరెస్ట్ సైబర్ మోసాన్ని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) అధికారులు అడ్డుకున్నారు. బాధితుడు మోసగాళ్లకు బదిలీ చేసిన రూ.85.20 లక్షలను అధికారులు సకాలంలో ఫ్రీజ్ చేసి కాపాడారు.

NIA అధికారినంటూ బెదిరింపులు

మోసగాడు తాను NIA అధికారినని చెప్పి బాధితుడికి ఫోన్ చేశాడు. అతడి ఆధార్ వివరాలను ఉపయోగించి కర్ణాటక, కేరళలో సుమారు రూ.2.5 కోట్ల మోసపూరిత లావాదేవీలకు పాల్పడ్డారని నమ్మించాడు.

తెలుగులో మాట్లాడుతూ, పోలీస్ యూనిఫాంలో వీడియో కాల్‌లో కనిపించిన మోసగాడు.. అరెస్ట్ చేస్తామని బెదిరించాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని, లేకపోతే పోలీసులు ఇంటికి వస్తారని హెచ్చరించాడు.

దీంతో భయపడిన బాధితుడు RBI వెరిఫికేషన్ పేరుతో రూ.85.20 లక్షలను మోసగాడు సూచించిన బ్యాంకు ఖాతాకు బదిలీ చేశాడు. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత డబ్బు తిరిగి ఇస్తామని మోసగాడు హామీ ఇచ్చాడు. అయితే ఆ తర్వాత మరో రూ.42 లక్షలు చెల్లించాలని కోరడంతో బాధితుడికి అనుమానం వచ్చింది.

వెంటనే స్పందించిన సైబర్ పోలీసులు

బాధితుడు తన బ్యాంకును సంప్రదించడంతో తాను సైబర్ మోసానికి గురైనట్లు తెలుసుకున్నాడు. వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేశాడు.

TGCSB అధికారులు వెంటనే డబ్బు లావాదేవీలను ట్రాక్ చేసి, IDFC బ్యాంక్ కోయంబత్తూరు శాఖలోని అనుమానాస్పద ఖాతాను ఫ్రీజ్ చేశారు. దీంతో బాధితుడు బదిలీ చేసిన మొత్తం రూ.85.20 లక్షలు సురక్షితంగా నిలిపివేశారు. తదుపరి చర్యల కోసం ఫిర్యాదును మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.

TGCSB డైరెక్టర్ శిఖా గోయల్ ప్రజలను అప్రమత్తం చేస్తూ.. పోలీసులు, NIA, CBI, RBI లేదా ఇతర ప్రభుత్వ అధికారులు ఎవరూ వెరిఫికేషన్, దర్యాప్తు లేదా భద్రత పేరుతో డబ్బు బదిలీ చేయాలని అడగరని స్పష్టం చేశారు. సైబర్ మోసంలో డబ్బు పోగొట్టుకున్న వారు వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.