
D-News: సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ద్వారకుంట సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్‌ను ఢీకొన్న ఘటనలో పలువురు మృతి చెందడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు.
హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వం వెంటనే మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆయన కోరారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను కోరారు.
మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించిన కేటీఆర్.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాద బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
