తెలుగు మాట్లాడే మహిళలను టెలీకాలర్లుగా నియమించుకుని, తెలంగాణకు చెందిన అమాయక ప్రజలను టార్గెట్‌గా చేసుకుని భారీగా సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఓ ముఠా గుట్టును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఛేదించింది. ఢిల్లీలోని శివ మార్కెట్‌లో నిర్వహిస్తున్న మూడు నకిలీ కాల్ సెంటర్లపై అధికారులు ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఈ తనిఖీల్లో 21 మంది మహిళా టెలీకాలర్లు, ఓ పురుష బ్యాంకు ఖాతాదారుడిని అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో లలిత్ సింగ్, కుల్దీప్ సింగ్, అనిల్ అనే ముగ్గురు ప్రధాన నిర్వాహకుల పర్యవేక్షణలో వేర్వేరు టీమ్‌లుగా ఈ కాల్ సెంటర్లు గత ఏడాదిన్నరగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు వెల్లడైంది. అయితే ఈ కేసులో ప్రధాన సూత్రధారులుగా ఉన్న ముగ్గురూ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

తెలుగు మహిళలనే టార్గెట్ చేసి.. లోన్ల పేరుతో మోసం

మోసగాళ్లు 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న తెలుగు మాట్లాడే మహిళలను ప్రత్యేకంగా టెలీకాలర్లుగా నియమించుకున్నట్లు అధికారులు గుర్తించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల, హైదరాబాద్‌లోని సైదాబాద్, బోరబండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన మహిళలు ఈ కాల్ సెంటర్లలో పనిచేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.

తెలుగులోనే మాట్లాడటంతో బాధితులు సులభంగా నమ్మేలా చేసి మోసాలకు పాల్పడేవారు. తాము బజాజ్ ఫైనాన్స్ ప్రతినిధులమంటూ పరిచయం చేసుకుని, తక్కువ వడ్డీతో ఆకర్షణీయమైన రుణాలు ఇప్పిస్తామని నమ్మించేవారు. లోన్ మంజూరు కావాలంటే ప్రాసెసింగ్ ఫీజు, వెరిఫికేషన్, డాక్యుమెంటేషన్ ఛార్జీలు, ఇన్సూరెన్స్ ప్రీమియం వంటి వివిధ కారణాలు చెబుతూ దశలవారీగా డబ్బులు వసూలు చేసేవారు. బాధితుల నుంచి నగదు అందుకున్న అనంతరం ఫోన్ కాల్స్, సంభాషణలను నిలిపివేసేవారు.

బెదిరింపులు, బ్లాక్‌మెయిల్.. 22 కేసులతో సంబంధాలు

తాము మోసపోయినట్లు గుర్తించిన బాధితులు డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే నిందితులు బెదిరింపులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించేవారు. అంతేకాకుండా బాధితుల వ్యక్తిగత సమాచారం, గుర్తింపు పత్రాలను దుర్వినియోగం చేసి పరువు తీస్తామని బెదిరిస్తూ భయాందోళనలకు గురిచేసేవారు.

ఈ ఆపరేషన్‌లో పోలీసులు 23 మొబైల్ ఫోన్లు, రెండు బ్యాంకు పాస్‌బుక్కులను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో నమోదైన 22 సైబర్ క్రైమ్ కేసులతో ఈ ముఠాకు సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రధాన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను సేకరించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana