
తమిళనాడులో భాషా, సాంస్కృతిక గుర్తింపుకు సంబంధించిన కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల ప్రారంభంలో ‘తమిళ్ తాయ్ వాజ్తు’ను తప్పనిసరిగా ఆలపించేలా ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని తమిళనాడు శాసనసభ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించింది.
తీర్మానం ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇతర అధికారిక కార్యక్రమాల ప్రారంభంలో ‘తమిళ్ తాయ్ వాజ్తు’ను ఆలపించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి విజయ్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అధికార పక్షంతో పాటు ప్రతిపక్షాల నుంచి కూడా సంపూర్ణ మద్దతు లభించింది.
డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్, పీఎంకే, వీసీకే, సీపీఐ, బీజేపీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తదితర పార్టీల సభ్యులు తీర్మానానికి మద్దతు ప్రకటించారు. దీంతో ఎలాంటి వ్యతిరేకత లేకుండా తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఇదిలా ఉండగా, ‘తమిళ్ తాయ్ వాజ్తు’ విషయంలో తమిళనాడులో కొంతకాలంగా రాజకీయ చర్చ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముందుగా వందే మాతరం, అనంతరం జాతీయ గీతం ఆలపించిన తర్వాత ‘తమిళ్ తాయ్ వాజ్తు’ను పాడటంపై విమర్శలు వెల్లువెత్తాయి.
రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో గతంలో అనుసరించిన విధంగానే ముందుగా ‘తమిళ్ తాయ్ వాజ్తు’ను ఆలపించాలనే డిమాండ్ ఈ నేపథ్యంలో మరింత బలపడింది. ఈ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీలో తాజాగా ఆమోదించిన ఏకగ్రీవ తీర్మానం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో తమిళ భాషకు, తమిళ సాంస్కృతిక గుర్తింపుకు ప్రాధాన్యం కల్పించే దిశగా ఈ నిర్ణయం కీలక అడుగుగా భావిస్తున్నారు.
