D-News: భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అధికంగా ఉండటం, అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు, నెలవారీ F&O ఎక్స్‌పైరీ వంటి అంశాలు ఇన్వెస్టర్లపై ప్రభావం చూపాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యాయి.

నిఫ్టీ 24,219.05 పాయింట్ల గత ముగింపుతో పోలిస్తే 24,175.75 వద్ద ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడింగ్‌లో 24,128.85 స్థాయికి పడిపోయింది. ఉదయం 9:21 గంటలకు నిఫ్టీ 37.70 పాయింట్లు లేదా 0.16 శాతం నష్టంతో 24,181.35 వద్ద ఉంది. సెన్సెక్స్ కూడా స్వల్ప నష్టంతో 77,354.86 వద్ద కొనసాగింది.

మెటల్ షేర్లకు డిమాండ్

రంగాల వారీగా చూస్తే నిఫ్టీ మెటల్ 1.58 శాతం లాభంతో ముందంజలో నిలిచింది. రియల్టీ, ఐటీ, టెలికాం, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆయిల్ & గ్యాస్ సూచీలు కూడా లాభాల్లో ఉన్నాయి. అయితే విస్తృత మార్కెట్‌లో ఎక్కువ సూచీలు నష్టాల్లోనే ట్రేడయ్యాయి.

NSEలో Eternal, Trent, SBI Life, Adani Ports, TCS, Axis Bank, Tata Steel, Bharti Airtel, Infosys, ICICI Bank వంటి షేర్లు లాభపడగా.. Cipla, Asian Paints, Hindalco, Maruti, BEL తదితర షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

చమురు ధరలపై ఆందోళన

బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 92.40 డాలర్ల వద్ద ఉండగా, క్రూడ్ ఆయిల్ సుమారు 85.48 డాలర్ల వద్ద ట్రేడైంది. చమురు ధరలు ఎక్కువ కాలం అధికంగా ఉంటే భారత్‌ దిగుమతి ఖర్చులు పెరగడంతో పాటు ద్రవ్యోల్బణం, కంపెనీల నిర్వహణ వ్యయాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

మార్కెట్ నిపుణుల ప్రకారం, ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లలో బలహీనత, అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు, చమురు ధరలు, F&O ఎక్స్‌పైరీ కారణంగా దేశీయ మార్కెట్లలో అస్థిరత కొనసాగే అవకాశం ఉంది. అయితే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఇటీవల కొనుగోళ్ల వైపు మారడం కొంత సానుకూల అంశంగా కనిపిస్తోంది.

నిఫ్టీకి కీలక స్థాయిలు

టెక్నికల్‌గా 24,150–24,100 స్థాయి నిఫ్టీకి కీలక మద్దతుగా ఉంది. ఈ స్థాయి కిందకు వెళితే 24,000 తదుపరి సపోర్ట్‌గా ఉండొచ్చు. మరోవైపు 24,300 స్థాయి ముఖ్యమైన నిరోధంగా ఉంది. నిఫ్టీ 24,300 పైన స్థిరపడితే 24,500 వైపు పయనించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.