D Spiritual: Nov 11: అయోధ్య రామమందిర విరాళాల వ్యవహారం.. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీపై జైరామ్‌ రమేష్‌ విమర్శలు

బాధ్యులందరిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలి: కాంగ్రెస్‌ డిమాండ్‌

అయోధ్య రామమందిర నిర్మాణం కోసం సేకరించిన విరాళాల నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జైరామ్‌ రమేష్‌ బుధవారం బీజేపీ, రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)పై తీవ్ర విమర్శలు చేశారు. ఆలయ నిర్మాణం, నిర్వహణతో పాటు విరాళాల సేకరణలో ఆయా సంస్థలకు చెందిన వ్యక్తులు కీలక పాత్ర పోషించినందున, ఈ వ్యవహారంలో బాధ్యత నుంచి తప్పించుకోలేరని ఆరోపించారు. విరాళాల నిర్వహణకు సంబంధించిన అన్ని ఆర్థిక రికార్డులను బహిర్గతం చేయాలని, విచారణ పరిధిని విస్తరించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిపారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా చేసిన పోస్టులో జైరామ్‌ రమేష్‌ పలు ఆరోపణలు చేశారు. ఆలయ ట్రస్ట్‌ నిర్వహణ, నిర్మాణ పనులు, విరాళాల సేకరణ, కానుకల లెక్కింపు, వాటిని బ్యాంకుల్లో జమ చేయడం వంటి ప్రతి స్థాయిలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) సభ్యులు భాగస్వాములుగా ఉన్నారని పేర్కొన్నారు. కానుకల చోరీ, విరాళాల దుర్వినియోగం వంటి ఆరోపణలపై వారు బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు.

2021లోనే వెలుగులోకి వచ్చినట్లు ఆరోపణలు

రామమందిర నిర్మాణ విభాగం, అకౌంట్స్‌ విభాగాల్లో పనిచేసిన అధికారులు విరాళాల నిర్వహణలో అక్రమాలను గతంలోనే గుర్తించారని జైరామ్‌ రమేష్‌ ఆరోపించారు. ఈ వ్యవహారంలో రామమందిర ట్రస్ట్‌ సభ్యులు చంపత్‌ రాయ్‌, అనిల్‌ మిశ్రా, గోపాల్‌ రావుల పాత్రపైనా ప్రశ్నలు లేవనెత్తారు. మాజీ అకౌంట్స్‌ అధికారి మహిపాల్‌ సింగ్‌ చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ, విరాళాల నిర్వహణలో అవకతవకలు 2021లోనే వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు.

ఈ అక్రమాల గురించి మహిపాల్‌ సింగ్‌ చంపత్‌ రాయ్‌, గోపాల్‌ రావులకు సమాచారం అందించినప్పటికీ, బాధ్యులపై చర్యలు తీసుకోకుండా ఆయననే విధుల నుంచి తొలగించారని ఆరోపించారు. నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న ఇంజినీర్‌ దీనానాథ్‌ వర్మ ట్రస్ట్‌ కార్యాలయంలోని పనులకు 40 శాతం కమీషన్‌ డిమాండ్‌ చేసినట్లు కూడా జైరామ్‌ రమేష్‌ పేర్కొన్నారు.

ఈ ఆరోపణలపై చంపత్‌ రాయ్‌ను నేరుగా ప్రశ్నించారా? చార్జిషీట్‌లో కొంతమంది ట్రస్ట్‌ అధికారులను నిందితులుగా కాకుండా సాక్షులుగా ఎందుకు చేర్చారు? అంటూ ఆయన ప్రశ్నించారు. నిందితుల్లో కొందరికి ఆర్‌ఎస్‌ఎస్‌, బజరంగ్‌ దళ్‌తో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. మీడియా కథనాలను ఉటంకిస్తూ అనుకల్ప్‌ మిశ్రా, సుభాష్‌ శ్రీవాస్తవ, తిన్ను యాదవ్‌లకు ఆలయ నిర్వహణ వర్గాలతో సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.

బాధ్యులందరిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలి

ఈ వ్యవహారంపై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తు తీరును కూడా జైరామ్‌ రమేష్‌ ప్రశ్నించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు భాగస్వాములుగా ఉన్న ట్రస్ట్‌కే తొలి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) నివేదికను ఎందుకు అప్పగించారని నిలదీశారు. ఆ నివేదికను బహిరంగపరచాలని, ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న వారందరి పాత్రను విచారణలో ఎందుకు పరిశీలించలేదో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.

ఆలయ నిర్మాణం, పరిపాలన, విరాళాల నిర్వహణలో బాధ్యత వహించిన ప్రతి ఒక్కరిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సమగ్ర దర్యాప్తు జరపాలని కాంగ్రెస్‌ కోరుతోందని తెలిపారు. అన్ని ఆర్థిక రికార్డులను బహిర్గతం చేయడంతో పాటు విచారణ పరిధిని విస్తరించాలని, దోషులుగా తేలిన వారందరిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *