
D Spiritual: Oct 17: జోగులాంబ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన కలెక్టర్
కర్నూలు, కలెక్టరేట్ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అలంపూర్ శ్రీ జోగులాంబ సమేత బాలబ్రహ్మేశ్వర స్వామి, అమ్మవార్లకు కలెక్టర్ డా. ఏ. సిరి సంప్రదాయం ప్రకారం పట్టువస్త్రాలను సమర్పించారు.
శనివారం ఆలయానికి చేరుకున్న కలెక్టర్కు అధికారులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ముందుగా బాలబ్రహ్మేశ్వర స్వామివారికి అభిషేకం నిర్వహించిన అనంతరం, స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వేద పండితులు కలెక్టర్కు వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు సమర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జోగులాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి ఏటా పట్టువస్త్రాలు సమర్పించే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. స్వామివారు, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బి. సుధాకర్ రెడ్డి, అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం ఈవో దీప్తి, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
