
D Spiritual: Oct 17: బ్రహ్మంగారిమఠం: భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి పనులు
బ్రహ్మంగారిమఠం: జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠంలో భక్తులు, యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. మఠాధిపతి శ్రీ వీరధర్మజ వేంకటాద్రి స్వామివారి సంకల్పం మేరకు ఈ పనులు కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం పోకరాజు వారి సంపూర్ణ ఆర్థిక సహకారంతో అన్నదానం కోసం నూతన వంటశాలను నిర్మిస్తున్నారు. అలాగే విజయ గుప్తా వారి ఆర్థిక సహకారంతో ప్రస్తుతం ఉన్న రేకుల షెడ్డు స్థానంలో కొత్త గాల్వనైజ్డ్ షెడ్డు ఏర్పాటు చేస్తున్నారు.
మఠం నిధులతో స్వామివారి నివాస గృహ పునర్నిర్మాణం, భక్తుల సౌకర్యార్థం పొంగళ్ల షెడ్డు నిర్మాణం, టీటీడీ ప్రాంగణ సుందరీకరణ పనులు చేపడుతున్నారు.
దాతల సహకారం అవసరమైన పనులు
భక్తులు వివిధ హోమాలు నిర్వహించుకునేందుకు నూతన యాగశాల నిర్మాణం, నిత్య అభిషేకాల కోసం కళ్యాణ మండపాన్ని అభిషేక మండపంగా మార్చి స్టీల్ గ్రిల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటితోపాటు స్వామివారి వాహనశాల మండపం, అలంకార మండపం నిర్మాణం, పాత వసతి గదుల ఆధునీకరణ, కొత్త వసతి గదుల నిర్మాణం చేపట్టాల్సి ఉంది.
అలాగే మఠం ప్రాంగణంలో, పోలేరమ్మ గుడి వద్ద మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసేందుకు భక్తులు ఉభయదాతలుగా లేదా విరాళాల రూపంలో సహకరించి పుణ్య కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని మఠం యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.
