
D Spiritual: Mar 23: తిరుమల శ్రీవారి భక్తులకు వడ్డించే అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదం నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన FSSAI (భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ) ల్యాబ్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
తిరుమలలోని పిండిమర ప్రాంతంలో ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. సుమారు 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, రెండు అంతస్తుల భవనంలో రూ. 20 కోట్ల వ్యయంతో ఈ వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ నిర్మించబడింది. ఇందులో నీరు, ఆహార పదార్థాలు, ముడి సరకుల నాణ్యతను సమగ్రంగా పరీక్షించే అత్యాధునిక యంత్రాలు ఏర్పాటు చేశారు.
భక్తులకు అందించే లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం నాణ్యతను మరింత మెరుగుపరచడానికి ఈ ల్యాబ్ ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నీరు, ముడి పదార్థాలు మరియు ఇతర పదార్థాల నాణ్యతను నిరంతరం పరిశీలించడం ద్వారా ప్రసాదాల రుచి, భద్రత మరింత మెరుగవుతుంది.
ఏపీ ప్రభుత్వం 2024 అక్టోబర్ 8న FSSAIతో ఒప్పందం కుదుర్చుకుని ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహకారంతో నిర్మించిన ఈ ల్యాబ్ దేశంలోనే తొలిసారిగా ఒక ఆలయంలో ఏర్పాటు చేయబడిన ప్రత్యేక ప్రయోగశాలగా గుర్తింపు పొందింది.
ఈ ల్యాబ్‌లో యాంటీబయోటిక్స్, పురుగు మందుల అవశేషాలు, లెడ్, ఆర్సెనిక్ వంటి హానికర పదార్థాలను గుర్తించే అధునాతన పరికరాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఫ్రాన్స్ నుంచి సుమారు రూ. 3 కోట్ల విలువైన ఈ-నోస్, ఈ-టంగ్ పరికరాలు కూడా తీసుకురానున్నారు, ఇవి ఆహార నాణ్యతను మరింత ఖచ్చితంగా విశ్లేషించడంలో సహాయపడతాయి.
ఇక తిరుమలలో భక్తులకు అందించే జలప్రసాదం నమూనాలను కూడా ఈ ల్యాబ్‌లో పరీక్షించనున్నారు. దీనివల్ల నీటి నాణ్యతపై కూడా నిరంతర పర్యవేక్షణ ఉంటుంది.
ల్యాబ్ ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు. భక్తులకు వేగంగా మరియు సులభంగా శ్రీవారి దర్శనం కల్పించేలా కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచనలు చేశారు.
