
DET:NOV 21:
కోర్టులో ప్రత్యేక స్క్రీనింగ్ ద్వారా సమస్య పరిష్కారం:
ఆండ్రియా జెరెమియా ప్రధాన పాత్రలో గోపి నైనార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మానుషి.ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ సమస్యలు మొదట్నుంచీ గందరగోళానికి గురి చేశాయి. ఈ సినిమాలో సామాజిక, రాజకీయ అంశాలు ఎక్కువగా ఉండటం వల్ల సెన్సార్ బోర్డు ఈ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. నిర్మాత, ప్రముఖ దర్శకుడు వెట్రి మారన్ ఈ అభ్యంతరాలు అధికంగా ఉన్నాయని భావించి న్యాయం కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ విచారణలో భాగంగా, ఇండియన్ సినిమా చరిత్రలోనే మొదటిసారిగా ఒక న్యాయమూర్తి స్వయంగా కోర్టు గదిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్క్రీనింగ్‌లో సినిమా మొత్తం చూశారు. వెట్రి మారన్ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, సెన్సార్ ప్రక్రియలో ఇది కొత్త విధానంగా అభివర్ణించారు.
తగ్గిన కట్స్ U/A 6+ సర్టిఫికేట్:
కోర్టు స్క్రీనింగ్ పూర్తయిన వెంటనే న్యాయమూర్తి ఇరుపక్షాల వాదనలు విన్నారు. మొదట్లో సెన్సార్ బోర్డు ఏకంగా 36 దృశ్యాలను తొలగించాలని సూచించింది. కానీ, న్యాయమూర్తి సినిమా కథా నేపథ్యాన్ని మరియు ఉద్దేశాన్ని పరిగణనలోకి తీసుకుని సెన్సార్ బోర్డుతో తిరిగి చర్చించి, తుది నిర్ణయంగా కేవలం 12 దృశ్యాలు మాత్రమే తొలగించాలని ఆదేశించారు.ఈ సమతుల్యమైన నిర్ణయం సినిమా బృందానికి ఎంతో ఊరట కలిగించింది. ఈ తీర్పుతో మానుషి చిత్రానికి అధికారికంగా ‘U/A 6+ సర్టిఫికేట్ లభించింది.
పెద్ద తెరపై సందడికి సిద్ధం:
చాలా కాలంగా సెన్సార్ సమస్యలతో సతమతమైన మానుషి సినిమా, ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. దీని గురించి వెట్రి మారన్ మాట్లాడుతూ ప్రస్తుతం నా మాస్క్ సినిమా విడుదల పనులు తుది దశకు చేరుకున్నాయి. ఆ సినిమా విడుదలైన వెంటనే మానుషి విడుదల తేదీని ప్రకటించి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను ప్రారంభిస్తాం అని వెట్రి మారన్ తెలిపారు. దీంతో ఆండ్రియా జెరెమియా అభిమానులు మరియు మంచి కంటెంట్ ఆశించే ప్రేక్షకులు త్వరలో మానుషి చిత్రాన్ని పెద్ద తెరపై చూసే అవకాశం ఉంది.
