
CBSE Board Exams 2027: సీబీఎస్ఈ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 10, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. 2027 ఫిబ్రవరి 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా, పదో తరగతి పరీక్షలు మార్చి 9న, ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 9న ముగియనున్నాయి. పూర్తి వివరాలు, డేట్‌షీట్ డౌన్లోడ్ చేసుకునే విధానం తెలుసుకుందాం.
- CBSE విద్యార్థులకు కీలక అప్డేట్
- ఫిబ్రవరి 16 నుంచి బోర్డు పరీక్షలు ప్రారంభం
- మార్చి 9తో ముగియనున్న పదో తరగతి పరీక్షలు
- ఏప్రిల్ 9 వరకు కొనసాగనున్న 12వ తరగతి పరీక్షలు
CBSE Board Exams 2027: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పరిధిలో చదువుతున్న పదో తరగతి, 12వ తరగతి విద్యార్థులకు కీలక సమాచారం అందుబాటులోకి వచ్చింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను బోర్డు ప్రకటించింది. దీని ప్రకారం 2027 ఫిబ్రవరి 16 నుంచి రెండు తరగతుల పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల తేదీలు వెల్లడవడంతో విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ను మరింత వేగవంతం చేయాల్సిన సమయం ఆసన్నమైంది.
10వ తరగతి పరీక్షలు ఎప్పటివరకు?
సీబీఎస్ఈ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పదో తరగతి బోర్డు పరీక్షలు 2027 ఫిబ్రవరి 16న ప్రారంభమై మార్చి 9తో ముగియనున్నాయి. మరోవైపు 12వ తరగతి పరీక్షలు కూడా ఫిబ్రవరి 16 నుంచే మొదలుకానున్నాయి. అయితే ఈ పరీక్షలు ఏప్రిల్ 9 వరకు కొనసాగుతాయి. రెండు తరగతులకు కలిపి సుమారు 46 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు సమాచారం.
ప్రాక్టికల్ పరీక్షల తేదీలు ఇవే..
రాత పరీక్షలతో పాటు ప్రాక్టికల్ పరీక్షలు, ప్రాజెక్ట్ వర్క్, ఇంటర్నల్ అసెస్మెంట్ల నిర్వహణకు సంబంధించి కూడా సీబీఎస్ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. సాధారణ పాఠశాలల్లో 2027 జనవరి 1 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. శీతాకాల ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు మాత్రం ప్రత్యేక షెడ్యూల్ అమల్లో ఉంటుంది. ఆయా ప్రాంతాల విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షల తేదీల కోసం తమ పాఠశాల యాజమాన్యం ఇచ్చే సూచనలను అనుసరించాలి.
CBSE డేట్‌షీట్‌ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
విద్యార్థులు తమ పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఈ కింది విధానాన్ని అనుసరించాలి.
- ముందుగా CBSE అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- వెబ్‌సైట్‌లోని ‘Examination Circulars’ విభాగాన్ని ఓపెన్ చేయాలి.
- అక్కడ 2027 పదో తరగతి లేదా 12వ తరగతి డేట్‌షీట్ లింక్‌ను ఎంచుకోవాలి.
- సంబంధిత లింక్‌పై క్లిక్ చేస్తే పరీక్షల షెడ్యూల్ PDF రూపంలో కనిపిస్తుంది.
- ఆ PDFను డౌన్లోడ్ చేసుకుని భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.
పరీక్షలకు ఇంకా కొన్ని నెలల సమయం ఉండటంతో విద్యార్థులు ఇప్పటి నుంచే సబ్జెక్టుల వారీగా చదువుకునే ప్రణాళిక సిద్ధం చేసుకోవడం మంచిది. డేట్షీట్లో పేర్కొన్న తేదీలను దృష్టిలో ఉంచుకుని రివిజన్, మాక్ టెస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలి.
