
D Spiritual: Sep 22:తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే బతుకమ్మ పండుగ వచ్చేసింది.
సెప్టెంబర్ 21న పెత్తరామాస, ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై, సెప్టెంబర్ 29న సద్దుల బతుకమ్మ (పెద్ద బతుకమ్మ)తో వేడుకలు ముగుస్తాయి. పండుగ అంటే తెలంగాణ ప్రజలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆనందమే.
బతుకమ్మ పండుగ అంటే ముందుగా గుర్తు చేసుకునేది పూలే.
వివిధ రకాల పూలను తెచ్చి అందంగా పేర్చడం ఈ పండుగ ప్రత్యేకత. అయితే బతుకమ్మ పేర్చేటప్పుడు కొన్ని ప్రత్యేక పూలు తప్పనిసరిగా ఉపయోగిస్తారు.
తంగేడు పువ్వు, గునుగు పువ్వు, సీతమ్మవారి పువ్వు — ఇవి లేకుండా బతుకమ్మ పూర్తిగా చేయలేరని చెప్పొచ్చు. ముఖ్యంగా గునుగు పువ్వు అయితే తప్పనిసరి. దీని వలన బతుకమ్మ అందంగా మాత్రమే కాకుండా, ఆకర్షణీయంగా కూడా కనిపిస్తుంది.
గునుగు పువ్వు ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉంటుంది.
తెలంగాణలో ఎక్కువగా కనిపించే ఈ గడ్డి జాతి పువ్వు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దీని ఆకులను పేస్ట్ చేసి గాయాలపై రాస్తే గాయం త్వరగా మాని పోతుందని నమ్మకం.
కందిరీగ కుట్టినప్పుడు గునుగు రసం ఉపయోగకరమని చెబుతారు.
ఇది మంటను తగ్గించడమే కాకుండా గాయం త్వరగా మానడానికి సహాయపడుతుంది. అలాగే క్షయవ్యాధి నివారణకు కూడా దీని ఆకుల రసాన్ని ఉపయోగిస్తారని అంటారు.
గునుగు గింజల ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
యూరినరీ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడతాయి. రక్తస్రావం, అతిసారం వంటి సమస్యలతో బాధపడేవారికి కూడా గునుగు గింజలు ఉపయోగకరమని చెబుతారు. అయితే గ్లకోమా ఉన్న వారు మాత్రం గునుగు గింజలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
