D-News: దేశీయ ఆటోమొబైల్‌ రంగంలో ఆగస్టు నెల అమ్మకాలు ఆశాజనకంగా ఉండే అవకాశం ఉందని ఆనంద్‌ రాఠీ నివేదిక తెలిపింది. ఇంధనం, వాహనాల ధరలు అధికంగా ఉన్నప్పటికీ ప్యాసింజర్‌ వాహనాలు, కమర్షియల్‌ వాహనాలు, ద్విచక్ర వాహనాల విభాగాల్లో రెండంకెల వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.

GST రేట్ల హేతుబద్ధీకరణ, రిటైల్‌ డిమాండ్‌ పెరగడం, గతేడాది తక్కువ బేస్‌ వంటి అంశాలు ఆటో రంగానికి మద్దతుగా నిలుస్తున్నాయని నివేదిక పేర్కొంది.

ప్యాసింజర్‌ వాహనాలకు భారీ డిమాండ్‌

ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు ఆగస్టులో ఏడాది ప్రాతిపదికన సుమారు 35 శాతం పెరిగే అవకాశం ఉందని ఆనంద్‌ రాఠీ తెలిపింది. బలమైన రిటైల్‌ అమ్మకాలు, డీలర్ల వద్ద ఇన్వెంటరీ పెరగడం ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంది.

కంపెనీల వారీగా చూస్తే టాటా మోటార్స్‌ 49 శాతం, మహీంద్రా అండ్‌ మహీంద్రా 45 శాతం, మారుతీ సుజుకీ 43 శాతం, హ్యుందాయ్‌ 11 శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని అంచనా వేసింది. వాహనాలపై డిస్కౌంట్లు కూడా గత నెలతో పోలిస్తే పెరిగినట్లు తెలిపింది.

కమర్షియల్‌ వాహనాలకూ మంచి ఊపు

కమర్షియల్‌ వాహనాల అమ్మకాలు 20–25 శాతం మేర పెరగవచ్చని నివేదిక పేర్కొంది. GST తగ్గింపుతో చిన్న రవాణాదారుల నుంచి కొత్త వాహనాల డిమాండ్‌ పెరగడం, సరుకు రవాణా కార్యకలాపాలు మెరుగుపడటం, మౌలిక వసతుల రంగంలో కార్యకలాపాలు వేగం పుంజుకోవడం ఇందుకు కారణాలని తెలిపింది.

అశోక్‌ లేలాండ్‌ 31 శాతం, టాటా మోటార్స్‌ 25 శాతం, M&M 22 శాతం, EIM-VECV 20 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా వేసింది.

ద్విచక్ర వాహనాల విక్రయాలు కూడా పెరుగుతాయి

ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఆగస్టులో సుమారు 15 శాతం పెరిగే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. అధిక బేస్‌ ఉన్నప్పటికీ రిటైల్‌ డిమాండ్‌ బలంగా ఉండటం సానుకూల అంశమని పేర్కొంది.

కంపెనీల్లో TVS మోటార్‌ 25 శాతం, హీరో మోటోకార్ప్‌ 11 శాతం, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 9 శాతం, బజాజ్‌ ఆటో 3 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చని తెలిపింది. లిస్టెడ్‌ ఆటో కంపెనీల ద్విచక్ర వాహనాల ఎగుమతులు సుమారు 33 శాతం పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

ట్రాక్టర్‌ మార్కెట్‌కు మాత్రం స్వల్ప వృద్ధి

ట్రాక్టర్‌ విక్రయాల్లో మాత్రం వృద్ధి పరిమితంగా ఉండొచ్చని ఆనంద్‌ రాఠీ అంచనా వేసింది. అధిక బేస్‌, బలహీన రుతుపవనాల ప్రభావంతో ఈ విభాగం కేవలం 4 శాతం వృద్ధికి పరిమితం కావచ్చని తెలిపింది.

M&M ట్రాక్టర్‌ అమ్మకాలు 6 శాతం పెరిగే అవకాశం ఉండగా, ఎస్కార్ట్స్‌ కుబోటా అమ్మకాలు స్వల్పంగా తగ్గవచ్చని అంచనా వేసింది.

మొత్తంగా, GST మార్పులు, పండుగల సీజన్‌ డిమాండ్‌, బలమైన రిటైల్‌ అమ్మకాలు ఆగస్టులో ఆటో రంగానికి కీలక మద్దతుగా నిలుస్తాయని నివేదిక పేర్కొంది.