
D Spiritual: Dec 5: జ్యోతిష్యం: భోజనం చేసే సమయంలో మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల గ్రహాల కోపానికి గురి కాక తప్పదని ఆధ్యాత్మిక పండితులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మామూలుగా ఆహారం తినే సమయంలో చాలామంది తెలిసీ తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఉదాహరణకు—తింటూ ఎక్కువగా మాట్లాడడం, వాగ్వాదాలు చేయడం వంటివి. హిందూ ధర్మం, జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆహారం కేవలం కడుపు నింపుకోవడానికే కాకుండా శక్తి, సంస్కారం, గ్రహాల సమతుల్యతతో కూడా ముడిపడి ఉంటుంది.
అందువల్ల ఆహారానికి సంబంధించిన కొన్ని అలవాట్లు గ్రహాల స్థితిపై నేరుగా ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. అలాగే వాస్తు, జ్యోతిషశాస్త్రాల్లో ఆహారానికి సంబంధించిన ఎన్నో నియమాలు ఉన్నాయి. వంట చేయడం నుండి తినడం వరకు పండితులు ప్రత్యేకమైన దిశలు, పద్ధతులు సూచించారు. ఇవన్నీ ప్రతి ఒక్కరూ పాటిస్తే మంచిదని చెబుతారు. కానీ తెలియకుండానే కొన్ని తప్పులు జరుగుతాయి. ఇవి ఆరోగ్యంపైనే కాకుండా గ్రహాల ప్రభావంపైనా ప్రభావితం చేయవచ్చని అంటున్నారు.
ఆహారం తీసుకునేటప్పుడు కొన్నిసార్లు నీరు, మిరపకాయలు, ఊరగాయలు, ఉప్పు అవసరం అవుతాయి. వాటిని అడిగి తెప్పించుకుంటాం. కానీ జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్న వివరాల ప్రకారం భోజనం చేసేటప్పుడు ఉప్పు అడగకూడదు.
భోజనం చేసేటప్పుడు ఉప్పు అడగడం అనే చిన్న అలవాటు కూడా మీ జాతకంలోని గ్రహాలను అసమతుల్యం చేసి సమస్యలను తెచ్చిపెట్టవచ్చని చెబుతున్నారు. భోజనం సమయంలో ఉప్పు అడిగితే అది చంద్రుడు, శుక్రుడు వంటి శుభగ్రహాల ప్రభావాన్ని తగ్గిస్తుందట. తెలుపు రంగు ఉప్పు చంద్రుడు, శుక్రగ్రహాలతో సంబంధం కలిగి ఉందని జ్యోతిష్యం చెప్తుంది. అందువల్ల ఉప్పు రుచిని పెంచడమే కాకుండా అదృష్టాన్నికూడా ప్రభావితం చేస్తుందని అంటున్నారు.
భోజనం సమయంలో ఉప్పు అడగడం మానసిక అస్థిరతకు సంకేతమని కూడా చెబుతారు. తరచుగా అలా చేసే వారు భౌతిక సుఖాలలో తగ్గుదలని అనుభవించే అవకాశముందని జ్యోతిష శాస్త్రం పేర్కొంటుంది. అలాగే ఎక్కువ ఉప్పు తినడం వల్ల సూర్య గ్రహం బలహీనమవుతుందనే నమ్మకం కూడా ఉంది.
దీనికి కారణం ఏమిటంటే–సూర్యుడు అగ్ని తత్త్వాన్ని సూచించే గ్రహం. ఇది ఆత్మవిశ్వాసం, శక్తి, నాయకత్వం, తేజస్సు, ప్రతిష్ట వంటి అంశాలకు కారకుడు. అయితే ఉప్పు భూమి, నీటి మూలకాలతో సంబంధం కలిగి ఉంటుంది. ఎక్కువగా ఉప్పును తీసుకోవడం వల్ల శరీరంలో నీటి మూలకం పెరిగి, బద్ధకం, సోమరితనం పెరుగుతాయి. నీటి మూలకం పెరిగితే అగ్ని మూలకం బలహీనపడుతుంది. అందుకే ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల వ్యక్తి తేజస్సు, నిర్ణయాధికారం తగ్గిపోతాయని జ్యోతిషం చెబుతోంది.
