
DET:NOV 12:
బెట్టింగ్ యాప్స్ కేసులో సిట్ విచారణకు హాజరు:
తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారం కేసులకు సంబంధించి దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం వేగవంతం చేసింది.ఈ కేసులో ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ మంగళవారం నవంబర్ 11,2025 హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయంలో సిట్ అధికారుల విచారణకు హాజరయ్యారు.తెలంగాణ ప్రభుత్వం అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలను అరికట్టడానికి,ఈ కేసులను సమగ్రంగా దర్యాప్తు చేయడానికి అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్,సీఐడీ పర్యవేక్షణలో ఈ సిట్‌ను ఏర్పాటు చేసింది.
గంటన్నరకు పైగా విచారణ,కీలక వివరాల సేకరణ:
సీఐడీ అధికారులు విజయ్ దేవరకొండను సుమారు గంటన్నర పాటు విచారించారు.ఈ సందర్భంగా నటుడి నుంచి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు.బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కోసం తీసుకున్న పారితోషికం ,కమీషన్ వివరాలు,ఆ యాప్‌ల కంపెనీలతో చేసుకున్న అగ్రిమెంట్ వివరాలపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం.
గతంలో ఈడీ విచారణ,నటుడి వివరణ:
ఇదే కేసులో అక్రమ నగదు లావాదేవీలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ గతంలో ఆగస్టు 2025లో కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు.ఆ సమయంలో,తాను కేవలం ఒక గేమింగ్ యాప్‌ను మాత్రమే ప్రమోట్ చేశానని,గేమింగ్ యాప్‌లకు,బెట్టింగ్ యాప్‌లకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.తాజా సిట్ విచారణలో,తాను ప్రచారం చేసిన A23 గేమింగ్ యాప్ తెలంగాణలో ఓపెన్ అవ్వదని అధికారులకు తెలిపినట్లు సమాచారం.
ముందు ముందు ప్రచారం చేయబోనని హామీ:
బెట్టింగ్ యాప్‌లు యువతను,సాధారణ ప్రజలను సులభంగా డబ్బు సంపాదించవచ్చని ఆశపెట్టి,ఆర్థికంగా,మానసికంగా ఇబ్బందులకు గురిచేసి,కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలకు కూడా దారితీస్తున్నాయనే ఫిర్యాదుల మేరకు ఈ కేసులు నమోదయ్యాయి.ఈ కేసుల దర్యాప్తులో భాగంగానే సినీ నటులు,సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేశారు.విచారణ అనంతరం,తాను ఇకపై ఎలాంటి గేమింగ్ లేదా బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేయబోనని విజయ్ దేవరకొండ అధికారులకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇదే కేసులో నటుడు ప్రకాశ్ రాజ్ కూడా సిట్ విచారణకు హాజరు కావాల్సి ఉంది.
