
D Spiritual: Nov 12: బ్రిటన్ పార్లమెంట్‌లో మార్మోగిన హనుమాన్ చాలీసా.. తొలిసారిగా ప్రత్యేక ఘట్టం!
బ్రిటన్ పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో తొలిసారిగా హనుమాన్ చాలీసా పఠనం జరిగింది. నవంబర్ 9న దీపావళి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తబలా, హార్మోనియం వాయిద్యాల నడుమ భక్తులు భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసాను ఆలపించారు. ఈ అరుదైన ఘట్టానికి సంబంధించిన వీడియో నవంబర్ 11న సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
లేబర్ ఏషియన్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో బ్రిటన్‌లో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన ప్రజలతో పాటు పలువురు పార్లమెంట్ సభ్యులు, సామాజిక ప్రముఖులు పాల్గొన్నారు. వెస్ట్‌మినిస్టర్ ప్యాలెస్‌లోని చోల్మోండేలీ రూమ్ అండ్ టెర్రస్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హియర్ అండ్ నౌ 365 వ్యవస్థాపకుడు మనీష్ తివారీ ఈ వేడుకలకు నాయకత్వం వహించగా, లేబర్ ఏషియన్స్ సొసైటీ పోషకుడు లార్డ్ ఉదయ్ నాగరాజు ఆతిథ్యం ఇచ్చారు.
ఈ సందర్భంగా తబలా, హార్మోనియం సంగీత వాయిద్యాల మధ్య హనుమాన్ చాలీసాను ఆలపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా మనీష్ తివారీ మాట్లాడుతూ.. దీపావళి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, వివిధ సమాజాల మధ్య ఐక్యతను చాటిచెప్పే వెలుగుల పండుగ అని పేర్కొన్నారు. హనుమాన్ చాలీసాకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కూడా వివరించారు.
హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు దీపావళిని జరుపుకుంటారని, ప్రస్తుతం బ్రిటన్‌లో వివిధ మతాలు, నేపథ్యాలకు చెందిన ప్రజలు కూడా ఈ వేడుకల్లో భాగస్వాములవుతున్నారని మనీష్ తివారీ తెలిపారు. హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో తొలిసారిగా హనుమాన్ చాలీసా పఠనం జరగడం తమ సమాజం ఎంతోకాలం గుర్తుంచుకునే అరుదైన సందర్భమని అన్నారు.
మరోవైపు కార్యక్రమానికి హాజరైన అతిథులను స్వాగతిస్తూ లార్డ్ ఉదయ్ నాగరాజు మాట్లాడుతూ.. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని పేర్కొన్నారు. హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో దీపావళి వేడుకలను నిర్వహించడం తనకు ఎంతో గర్వకారణమని తెలిపారు. లేబర్ ఏషియన్స్ సొసైటీ ప్రజాజీవనంలో కీలక పాత్ర పోషిస్తోందని, వివిధ సమాజాల మధ్య ఐక్యతను పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తోందని ప్రశంసించారు.
బ్రిటన్ పార్లమెంట్‌లో తొలిసారిగా హనుమాన్ చాలీసా పఠనం జరగడం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అంతర్జాతీయ వేదికపై లభిస్తున్న గుర్తింపుగా నిలిచింది. ఈ అరుదైన ఘట్టం భారతీయ సంతతి ప్రజల్లో ఆనందాన్ని నింపడమే కాకుండా, సాంస్కృతిక ఐక్యతకు చక్కని ఉదాహరణగా నిలిచింది.
