D Educt: Nov 12: తెలంగాణలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బోధి పెవిలియన్‌లో విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్నత విద్యగా పరిగణించి ప్రత్యేక బోధన అందించాలని సూచించారు. 12వ తరగతి నుంచి విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు.

ఆధునిక అవసరాలకు అనుగుణంగా తెలంగాణ విద్యా విధానంలో సంస్కరణలు తీసుకురావాలని సీఎం స్పష్టం చేశారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.

దేశంలోని 18 రాష్ట్రాల్లో ఇప్పటికే 12వ తరగతి వరకు ఒకే విద్యా విధానం అమలులో ఉందని సీఎం వెల్లడించారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే తెలంగాణలోనూ ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మార్పుల వల్ల ఒక్క విద్యార్థికి కూడా నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

జూనియర్ కళాశాలల సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది పదవీ విరమణ ప్రయోజనాలకు ఎలాంటి ఆటంకం లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు, సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *