
DNews: పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అంగన్వాడీ సేవలు ఎంతో ఉపయోగపడతాయని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. తల్లిదండ్రులు ఆరేళ్లలోపు పిల్లలను ప్రతిరోజూ అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని సూచించారు.
గజసింగవరంలో కార్యక్రమం
గంభీరావుపేట మండలం గజసింగవరంలోని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ‘మంగళవారం 10 నిమిషాలు’ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణులకు సామూహిక సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు.
అంగన్వాడీ కేంద్రంలో పిల్లల హాజరు, ఎత్తు, బరువు నమోదు ప్రక్రియను పరిశీలించారు. పిల్లలకు పోషకాహారంతో పాటు ఇంట్లోనూ సమతుల్య ఆహారం అందించాలని తల్లిదండ్రులకు సూచించారు.
పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ
కూరగాయలు, ఆకుకూరలు, బెల్లం, నువ్వులు, మునగ వంటి పోషక విలువలున్న ఆహార పదార్థాలను పిల్లలకు అందించాలని కలెక్టర్ తెలిపారు. బాలామృతం, బాలామృతం ప్లస్‌ను పిల్లలకు నచ్చే ఆహార పదార్థాల రూపంలో తయారు చేసి ఇవ్వాలని సూచించారు.
ముఖ్యంగా సామ్, మామ్ పిల్లలపై అంగన్వాడీ సిబ్బంది, సర్పంచులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులను గుర్తించి అవసరమైన ఆహారం, వైద్య సేవలు అందించాలని చెప్పారు.
ఆరోగ్య సమస్యలుంటే సమాచారం ఇవ్వాలి
ఐదేళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపాలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు గుర్తిస్తే సమీప అంగన్వాడీ కేంద్రానికి సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు. బాల భరోసా, ఆర్‌బీఎస్‌కే కార్యక్రమాల ద్వారా అవసరమైన వైద్య పరీక్షలు, ప్రత్యేక చికిత్స అందించే అవకాశం ఉందని వివరించారు.
గర్భిణులు, బాలింతలు కూడా తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, అంగన్వాడీ కేంద్రాలు అందిస్తున్న పోషకాహారం, ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి హనుమంతు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, తహసీల్దార్ మారుతిరెడ్డి, ఎంపీడీఓ రాజేందర్, సర్పంచ్ ఉమ్మారెడ్డి విమల తదితరులు పాల్గొన్నారు.
