
కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కుంటలో పడి తండ్రి, కుమార్తె ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
కామారెడ్డి: జిల్లాలోని లింగాయపల్లి గ్రామంలో విషాదకర ఘటన జరిగింది. గ్రామంలోని గోరిగోని కుంటలో ప్రమాదవశాత్తు పడి తండ్రి, కుమార్తె మృతి చెందారు. మృతులను సోమిశెట్టి రజిత (35), ఆమె తండ్రి సుంకరి పెద్ద నర్సింలు (65)గా గుర్తించారు. రజిత లింగాయపల్లి గ్రామానికి చెందినవారు కాగా, పెద్ద నర్సింలు కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టేక్రియాల్ గ్రామానికి చెందినవారు.
రజిత భర్త అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆమెను చూసేందుకు తండ్రి పెద్ద నర్సింలు వచ్చారు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం ఇద్దరూ గోరిగోని కుంట వద్దకు వెళ్లారు. అయితే అనుకోకుండా కుంటలో పడిపోవడంతో ఇద్దరూ నీట మునిగి మృత్యువాత పడ్డారు.
ఈ ఘటనలో రజిత కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆమెకు భర్తతో పాటు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
