CM Chandrababu Conducts Aerial Survey of Murasu Cyclone-Hit Areas, Seeks Central Assistance for Drought-Affected Farmers

మురసు తుఫాన్‌ కారణంగా దెబ్బతిన్న పంటలు, నీట మునిగిన గ్రామాలు, రహదారులను గగనతలం నుంచి పరిశీలించిన ముఖ్యమంత్రి. మరోవైపు కరువు పరిస్థితులపై కేంద్ర బృందానికి రాష్ట్ర సమస్యలను వివరించి సాయం కోరారు.

ఆంధ్రప్రదేశ్‌లో కరువు, తుఫాన్‌ ప్రభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి సహాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కరువు ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టాలను పరిశీలించిన కేంద్ర బృందం సీఎంతో సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను చంద్రబాబు వివరించారు.

కేంద్రానికి సీఎం కీలక విజ్ఞప్తులు

వీబీ జీ రామ్‌ జీ పథకం కింద పనిదినాలను 200 రోజులకు పెంచాలని సీఎం కోరారు. కరువు బాధితుల్లో అర్హులైన వారికి రేషన్‌ కార్డులు జారీ చేసే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. జల్‌ జీవన్‌ మిషన్‌ విస్తరణతో పాటు పంటల బీమా పరిహారాన్ని త్వరగా రైతుల ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

రాష్ట్రంలోని 21 జిల్లాల్లో 388 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించినట్లు కేంద్ర బృందానికి వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన కేంద్ర బృందం.. 15 రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలిపింది.

మురసు తుఫాన్‌ నష్టంపై ఏరియల్‌ సర్వే

మరోవైపు మురసు తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరియల్‌ సర్వే నిర్వహించారు. గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో తుఫాన్‌ కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. చిలకలూరిపేట, ఒంగోలు, కొత్తపట్నం, చినగంజాం, చీరాల, బాపట్ల ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని గగనతలం నుంచి వీక్షించారు.

తుఫాన్‌ ప్రభావంతో నీట మునిగిన పంటలు, వరద నీటితో చుట్టుముట్టిన గ్రామాలు, నీట మునిగి రాకపోకలు నిలిచిపోయిన రహదారులను సీఎం పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకునేందుకు ఏరియల్‌ సర్వే చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *