
Murasu Cyclone Effect on Telangana: మురసు తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు సమీపంలో తుఫాన్ తీరం దాటిన నేపథ్యంలో తెలంగాణలోనూ వాతావరణం మారనుంది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఏపీలో తీరం దాటిన మురసు తుఫాన్
తీవ్ర తుఫాన్‌గా మారిన మురసు నవంబర్ 3వ తేదీ తెల్లవారుజామున 3:30 గంటల నుంచి 5:30 గంటల మధ్య నెల్లూరు-నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరం దాటినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తుండగా, తెలంగాణలోనూ వర్షాలు, ఈదురుగాలులు సంభవించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్
మురసు తుఫాన్ ప్రభావంతో నవంబర్ 3, 4 తేదీల్లో తెలంగాణలోని నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఈ మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్
సూర్యాపేట, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాలకు నవంబర్ 3, 4 తేదీల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ ప్రాంతాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడటంతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గరిష్ఠంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
మరో 13 జిల్లాల్లోనూ భారీ వర్షాలు
రాబోయే రెండు రోజుల్లో తెలంగాణలోని మరికొన్ని జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఈ ప్రాంతాల్లో గంటకు గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
నవంబర్ 5న ఈ జిల్లాల్లో వర్ష సూచన
నవంబర్ 5వ తేదీన వికారాబాద్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకూడదు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అధికారుల సూచనలు పాటించాలి.
మొత్తంగా మురసు తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో రాబోయే రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా రెడ్ అలర్ట్ ప్రకటించిన నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
