
D Spiritual: Oct 19: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు అక్టోబర్ 19, 2026 (సోమవారం) మహానవమి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహవాహినిగా, వివిధ ఆయుధాలను ధరించి ఉగ్రరూపంలో వెలసిన అమ్మవారిని దర్శించుకుంటే శత్రుబాధలు తొలగి, విజయం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
నేటి మహానవమి సందర్భంగా అమ్మవారు ఆశ్వయుజ శుద్ధ నవమి తిథిలో శ్రీ మహిషాసురమర్దిని దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ పవిత్రమైన రోజున అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అమ్మవారికి సమర్పించే నైవేద్యాల్లో చక్రపొంగలి, పులిహోర, గారెలు, వడపప్పు, నిమ్మరసం, పానకం ప్రత్యేకంగా ఉంటాయి. ఈ సందర్భంగా భక్తులు బ్రౌన్ లేదా ఎరుపు రంగు హ్యాండ్లూమ్ చీరలను ధరించడం విశేషంగా భావిస్తారు.
మహానవమి పర్వదినం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో వేచి ఉండి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దసరా నవరాత్రులలో అత్యంత విశిష్టమైన ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇక శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 20, 2026 (మంగళవారం) విజయదశమి రోజున శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అదే రోజు సాయంత్రం కృష్ణా నదిలో వైభవంగా హంసవాహన తెప్పోత్సవం నిర్వహించనున్నారు. ఈ తెప్పోత్సవంతో ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి.
