
D NEWS: తెలంగాణలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సమగ్ర భూ రీసర్వే చేపట్టినట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ప్రక్రియను మూడు దశల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ప్రతి భూకమతానికి స్పష్టమైన హద్దులు నిర్ణయించి, యాజమాన్య హక్కులపై స్పష్టత కల్పించడం లక్ష్యమని వివరించారు.
రాష్ట్రంలోని 10,954 రెవెన్యూ గ్రామాల్లో తొలి దశలో 2,720 గ్రామాలను ఎంపిక చేసినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటివరకు 285 గ్రామాల్లో సర్వే పూర్తయిందని వెల్లడించారు. ఈ గ్రామాల్లో భూ యజమానుల నుంచి అభ్యంతరాలు స్వీకరించేందుకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు.
భూముల కొలతల్లో కచ్చితత్వం పెంచేందుకు డీజీపీఎస్, రోవర్లు, జీఐఎస్, క్యూజీఐఎస్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు పొంగులేటి పేర్కొన్నారు. ఇప్పటికే 411 రోవర్లను కొనుగోలు చేశామని, మరో 400 రోవర్ల కొనుగోలుకు టెండర్లు ఖరారయ్యాయని తెలిపారు. అలాగే, సర్వే వివరాలను డిజిటల్ రూపంలో భద్రపరచి భూ భారతి పోర్టల్‌లో నమోదు చేస్తామని చెప్పారు.
రీసర్వే పూర్తయిన తర్వాత ప్రతి సర్వే నంబర్‌కు ప్రత్యేక భూదార్ నంబర్ కేటాయించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆధార్ తరహాలో ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపు కల్పించేలా భూదార్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. దీంతో భూ హద్దులు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సమయంలో ఎదురయ్యే సమస్యలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
సర్వేకు ముందు భూ యజమానులకు నోటీసులు ఇవ్వాలని, గ్రామాల్లో చాటింపు చేయాలని అధికారులను పొంగులేటి ఆదేశించారు. ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు, గ్రామకంఠం హద్దులను స్పష్టంగా గుర్తించాలని సూచించారు. సర్వే పూర్తయిన గ్రామాల్లో అభ్యంతరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి పరిష్కరించాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
