Shah Rukh Khan: Sequels Waiting for the King Khan, Don 3 Return Rumours Surface Again

D News : ‘డంకీ’ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న షారూఖ్ ఖాన్ ప్రస్తుతం ‘కింగ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. షూటింగ్ ముగింపు దశకు చేరుకోవడంతో.. కింగ్ ఖాన్ తర్వాత ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారనే ఆసక్తి బాలీవుడ్‌లో నెలకొంది.

డాన్ 3పై మళ్లీ చర్చ

షారూఖ్ కోసం ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ‘డాన్ 3’ పేరు మరోసారి వినిపిస్తోంది. ఈ సినిమా తొలుత రణవీర్ సింగ్‌తో చేయాలని భావించినా.. ప్రాజెక్ట్‌పై తాజా పరిణామాల నేపథ్యంలో తిరిగి షారూఖ్ దగ్గరకు వచ్చినట్లు బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. దర్శకుడు ఫర్హాన్ అక్తర్‌తో షారూఖ్ ఈ ప్రాజెక్ట్‌పై చర్చలు జరుపుతున్నట్లు టాక్.

అయితే ఈ సినిమాలో అట్లీ కూడా భాగమైతేనే నటించేందుకు షారూఖ్ ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే షారూఖ్–అట్లీ కాంబినేషన్‌లో ‘జవాన్ 2’పై కూడా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే.

పఠాన్ 2పై కూడా ప్లాన్?

యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా వచ్చిన కొన్ని సినిమాల ఫలితాల నేపథ్యంలోనూ.. షారూఖ్‌తో ‘పఠాన్ 2’ చేయాలని నిర్మాణ సంస్థ ఆలోచిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ సీక్వెల్ కోసం స్క్రిప్ట్ వర్క్ మొదలైనట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

మై హూనా 2పై ఫరా ఖాన్ హింట్

ఇక షారూఖ్ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటైన ‘మై హూనా’ సీక్వెల్‌పైనా చర్చ మొదలైంది. ఇటీవల అర్జున్ కపూర్ ఈ సినిమాను మళ్లీ చూశానని, సీక్వెల్ చేయాలని ఫరా ఖాన్‌ను సోషల్ మీడియాలో ట్యాగ్ చేశారు. దీనికి ఫరా ఖాన్ కూడా సానుకూలంగా స్పందించడంతో ‘మై హూనా 2’పై అంచనాలు మొదలయ్యాయి.

షారూఖ్, ఫరా ఖాన్ కాంబినేషన్‌లో ఇప్పటికే మూడు సినిమాలు రావడంతో ఈ జోడీకి ప్రత్యేక క్రేజ్ ఉంది. దీంతో ‘కింగ్’ తర్వాత షారూఖ్ ఏ ప్రాజెక్ట్‌ను ఎంచుకుంటారనే విషయం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం డాన్ 3, పఠాన్ 2, మై హూనా 2 వంటి సీక్వెల్స్ ఆయన తదుపరి లైనప్‌లో చర్చనీయాంశంగా ఉన్నాయి.

By Avinash